అసమానతలను సృష్టించే శక్తులు ఐరోపాకు కూడా వ్యాపిస్తాయి 

 ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్య ధోరణులను ఎదిరించడం చాలా ముఖ్యమని, లేనిపక్షంలో అసమానతలను సృష్టించే శక్తులు ఐరోపాకు కూడా వ్యాపిస్తాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు. దూరంగా ఉండటం రక్షణ కవచం కాబోదని స్పష్టం చేశారు. 
 
ఇండో-పసిఫిక్‌పై జరిగిన ప్యారిస్ లో జరిగిన ఐరోపా  యూనియన్ మినిస్టీరియల్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ  సుస్థిర బహుళ ధ్రువ ప్రాంతం, సుస్థిర ప్రపంచం కోసం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ కలిసి రావాలని కోరారు. 
ఇండో-పసిఫిక్ రీజియన్‌లో బలమైన భాగస్వామ్యం, ప్రయోజనాలు యూరోపియన్ యూనియన్‌కు, ఫ్రాన్స్‌కు ఉన్నాయని చెబుతూ ఈ ప్రాంతం భద్రతకు ఈ రెండూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఇది మారిటైమ్ సెంచరీగా నిలుస్తుందని పేర్కొ న్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆటుపోట్లు కచ్చితంగా దాని భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని చెప్పారు. సమష్టి కృషి వల్ల ఈ సముద్రాలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఈ సముద్రాల వనరులను పరిరక్షించవచ్చునని, పరిశుభ్రంగా ఉంచవచ్చునని తెలిపారు.
యూరోపియన్ యూనియన్‌కు ఆర్థిక బలం, నైపుణ్యం ఉన్నందువల్ల ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అనుసంధానం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వాతావరణ మార్పులు, జీవ వైవిద్ధ్యం, ఆరోగ్యం, భద్రత వంటి అంశాల్లో తన వంతు పాత్రను పోషించవచ్చునని జైశంకర్ సూచించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్చాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. భారత దేశ వైఖరి చాలా విశాలమైనదని, ఉమ్మడి లక్ష్యం కోసం వివిధ దేశాలు కలిసికట్టుగా పని చేయాలని భారత దేశం కోరుకుంటోందని ఆయన చెప్పారు.