విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే

కర్నాటక విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కర్నాటక హైకోర్టు నిర్ణయాన్ని కూడా అంగీకరించాలి” అని స్పష్టం చేశారు. 

“పాఠశాల డ్రెస్ కోడ్‌ను అందరూ అంగీకరించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఈ వివాదాంశం కోర్టులో ఉంది. కోర్టు విచారణ జరుపుతోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ దానిని పాటించి తీరాలి” అని ఆయన ఒక  ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణ జరుపుతున్న తరుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్యానాలు చేశారు.

ఇదిలావుండగా కర్నాటక విద్యాలయాలు, కళాశాలల్లో మతపరమైన వస్త్రాలు ధరించి ప్రవేశించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. 

ఇక ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘80 వర్సెస్ 20 పోరు’ అన్న విషయంపై ప్రశ్నించగా, హిందూ, ముస్లిం ఓటర్లను అలా ఆయన విభజించి చెప్పడాన్ని అమిత్ షా విభేదించారు. 

“ఎన్నికలు ముస్లింలు, యాదవులు, హిందువులది అని కాదు. యోగి ఓటింగ్ శాతం గురించి అని ఉంటారేమో తప్ప ముస్లింలు వర్సెస్ హిందువుల గురించి అయి ఉండదు” అని షా జవాబిచ్చారు.