బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్

బ్రిటన్ రాణి ఎలిజబెత్- II (95)కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి స్వల్ప లక్షణాలతో ఉన్న ఆమెకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ఆదివారం వెల్లడించింది. రాణి ఎలిజబెత్‌ జలుబు, తేలికపాటి జ్వరం మాత్రమే ఉన్నట్లుగా ప్యాలెస్ తెలిపింది.  
 
ఎలిజబెత్ తన విండర్స్ కాజిల్ నివాసంలో ఉన్నారని తెలిపింది.ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలో బ్రిటన్ రాణికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితమే ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే రాణి తన అధికారిక బాధ్యతలను కుదించుకున్నారని తెలిపారు. రాణి కొన్ని రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. 
 
ఇలా ఉండగా, వచ్చే వారంకల్లా కరోనా ఆంక్షలన్నింటినీ తొలగించేస్తామని బ్రిటన్ ప్రభుత్వం  ధ్రువీకరించింది. ఇకపై కరోనా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ అన్ని ఆంక్షలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. 
 
“మన స్వాతంత్య్రాన్ని నియంత్రించేకన్నా, మనల్ని మనం కాపాడుకోవాలి” అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే అనేక వైరస్ ఆంక్షలను ఎత్తేసింది. వెన్యూలకు వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను రద్దుచేసింది. అలాగే ఇంగ్లాండ్‌లోని చాలా వరకు ఆసుపత్రుల్లో మాస్కు ధరించే ఆంక్షలను పక్కనబెట్టారు. 
 
స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌లు కూడా కూడా ఆంక్షలను మెల్లమెల్లగా సడలిస్తున్నాయి. రష్యా తర్వాత ఐరోపాలో ఇంగ్లాండ్‌లోనే కరోనావైరస్ మరణాలు ఎక్కువ. అక్కడ ఇప్పటి వరకు 1,60,000 మరణాలు రికార్డు అయ్యాయి. 
 
మరోవంక, కరోనా వైరస్‌కు సంబంధించి ఇంకా తెలియనిది చాలానే ఉందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. కరోనావైరస్ ఉచిత పరీక్షలను రద్దు చేయొద్దని కూడా వారు కోరుతున్నారు. కాగా వైరస్‌ను కట్టడి చేయడంలో ‘మాస్ టెస్టింగ్’ బాగానే పనిచేసిందని ఆరోగ్య అధికారులు తెలిపారు.