100 శాతం వ్యాక్సినేషన్ దిశగా భారత్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది.  దేశవ్యాప్తంగా అర్హతగల 80 శాతం మంది జనాభాకు కరోనా  వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘సబ్కా ప్రయాస్’ మంత్రంతో, దేశం 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా వేగంగా దూసుకుపోతోందని మాండవియ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ఇవ్వబడిన కరోనా వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య గురువారం నాటికి 174.59 కోట్లు దాటింది. 

గురువారం సాయంత్రం 7 గంటల వరకు 33 లక్షలకు పైగా (33,62,813) వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్ల సంఖ్య కూడా రెండు కోట్లకు చేరింది.

ఈ సందర్బంగా కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ…  టీనేజర్లు ఉత్సాహంగా కరోనా  టీకాలు తీసుకుంటున్నారని తెలిపారు. 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి కొవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మూడో వేవ్‌ నేపథ్యంలో ప్రికాషనరీ డోస్‌ సైతం వేసింది.

 ఇలా ఉండగా, దేశంలో ఒమిక్రాన్‌ వైరస్‌ అదుపులోకి వస్తుంది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. 22 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 12,54,893 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 22,279 మందికి కరోనా సోకింది. క్రితం రోజు కన్నా 14 శాతం తక్కువ. 
 
తాజాగా 325 మంది మరణించారు. దీంతో కరోనా వేవ్‌ మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 4,28,02,505 మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 5.11 లక్షల మందికి పైగా మరణించారు. అదేవిధంగా గత 24 గంటల్లో 60298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4.19 మంది కోవిడ్‌ను జయించారు.
 
 రికవరీ రేటు 98.21 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు 1.8 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,53,739 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. టీకాల విషయంలో భారత్‌ మరో మైలు రాయిని చేరుకుంది. 175.03 కోట్ల వ్యాక్సిన్ల వినియోగం అయ్యాయి.