ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేందుకు కృషి… బైడెన్ ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేందుకు కృషి… బైడెన్ ప్రకటన
ఉక్రెయిన్‌పై మరికొద్ది రోజుల్లో దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ యుద్ధం దిశగా రష్యా ముందుకు కదలడాన్ని నిరోధించేందుకు  తాము తమ శక్తినంతటినీ వినియోగించి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
 
మహా విపత్కరమైన, అవసరం లేని యుద్ధాన్ని ఎంచుకున్నందుకు బాధ్యత వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను హెచ్చరించారు.  రాబోయే వారంలో, రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికి రష్యా దళాలు ప్రణాళిక రచిస్తున్నాయని, ఆలోచిస్తున్నాయని విశ్వసించేందుకు తగిన కారణం ఉందని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ రాజధాని నగరం క్యివ్‌పై రష్యా దళాలు దాడి చేస్తాయని నమ్ముతున్నామని పేర్కొంటూ ఈ నగరంలో అమాయకులైన 2.8 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నారని చెబుతూ  ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దుల్లో ఉన్న బెలారస్ నుంచి దక్షిణ దిశలో ఉన్న నల్ల సముద్రం వరకు రష్యా తన దళాలను మోహరించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను బైడెన్ ప్రశంసించారు. యుద్ధంలోకి తమను లాగడానికి రష్యాకు ఉక్రెయిన్ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో ఉక్రెయిన్ దళాలు చాలా గొప్ప సంయమనం, బలం, జడ్జిమెంట్‌ను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు.
నాటో  భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకోవడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా ఉమ్మడి భద్రతకు ఎదురయ్యే ముప్పును కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  రష్యా ఇప్పటికీ దౌత్య మార్గాన్ని ఎంచుకోవచ్చునని హితవు చెప్పారు. ఉద్రిక్తతలను సడలించి, తిరిగి చర్చలు జరపడానికి ఇప్పటికీ అవకాశం ఉందని తెలిపారు.
కాగా, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి విక్టోరోవిచ్ లవ్‌రోవ్  ఫిబ్రవరి 24న చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. అంతకన్నా ముందే సైనిక చర్యకు రష్యా ఉపక్రమిస్తే, దౌత్య మార్గానికి తలుపులు మూసేసినట్లేనని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఎంచుకుంటే, అందుకు అత్యధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
 రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు విధించే ఆంక్షలను మాత్రమే కాకుండా, మిగతా ప్రపంచం నైతికంగా వ్యక్తం చేసే ఆగ్రహాన్ని కూడా రష్యా రుచి చూడాల్సి వస్తుందని బైడెన్ స్పష్టం చేశారు. మరోవంక,  రష్యా దళాల్లో దాదాపు 40 శాతం నుంచి 50 శాతం దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాడికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.