విజయవాడలో తొలిసారి 15 రకాల మిసైళ్ల ప్రదర్శన

భారత రక్షణ రంగంలో కీలకమైన 15 మిసైళ్ల ప్రదర్శనకు రాష్ట్రం వేదిక కానుంది. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) రూపొందించిన 15 రకాల మిసైళ్లను విజయవాడలోని ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో ప్రదర్శించనున్నారు. 
 
ముఖ్యంగా శాటిలైట్ల ప్రయోగాలు, విధానాలపై ఇస్రో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రొఫెసర్‌ అబ్దుల్‌ రజాక్‌ నేతృత్వంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన శాస్త్రసాంకేతిక ప్రగతిని వివరించే దిశగా వీటిని ఏర్పాటు చేశారు. 
 
డిఆర్‌డిఒ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మిసైళ్లను ఇక్కడ ప్రదర్శించనున్నట్లు విజయవాడ సైన్స్‌ పండగ ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌పిఎ) అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పివిఎస్‌ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. సైన్స్‌ ఏర్పాట్లపై ఎస్‌పిఎలో ఏర్పాట్లను పరిశీలించారు. 
 
విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజ్ఞాన ప్రసార్‌ ఆధ్వర్యాన డిఎస్‌టి, డిబిటి, సిఎస్‌ఐఆర్‌, ఎంఇఎస్‌, ఇస్రో, డిఎఇ, ఐసిఎంఆర్‌, డిఆర్‌డిఒ సంస్థల సహకారంతో ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
స్వాతంత్య్రానంతరం దేశంలో రూపొందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పిల్లల్లో సైన్స్‌, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎలా ఉందనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
 
 దేశ రక్షణ రంగంలో వినియోగించే మిసైళ్ల పరిజ్ఞానం, వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా వినియోగిస్తారు అనే అంశాలపై నమూనాలు, వీడియోలు, సైన్స్‌ ఫిలిమ్స్‌ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఈ తరహా సైన్స్‌ ప్రదర్శన తొలిసారని, ఇప్పటి వరకూ మిసైళ్ల ఎగ్జిబిషన్‌ రక్షణ రంగ ప్రాంగణాల్లోనే జరిగిందని పేర్కొన్నారు. 
 
విజయవాడలో జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో పుస్తక ప్రదర్శన కీలకమని చెప్పారు. పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, తక్కువ ఖర్చుతో సైన్స్‌ ప్రయోగాల బాధ్యులు రాజశేఖర్‌ రాహుల్‌, కె.శ్రీనివాస్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.