ధాన్యం రవాణా చార్జీల పేరుతో రూ.వంద కోట్లు స్వాహా

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రవాణా చార్జీల నెపంతో మిల్లర్లు, అధికారులు రూ.వంద కోట్లు పంచుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు మూలకు చేరాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగా పొలాలు ఉన్నా.. రైతులు ఢిల్లీ వరకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దళారులకు, మిల్లర్లకు వత్తాసు పలుకుతున్న పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న నీటి వనరులు సద్వినియోగం కావడం లేదని ధ్వజమెత్తారు. 

 శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు..  కేవలం రూ.4 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై బీజేపీ ఉద్యమిస్తుందని వీర్రాజు ప్రకటించారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల కోసం పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. 

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందడం లేదని ఆయన విమర్శించారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్ల మోసాలను ఆపలేని పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని సోము డిమాండ్‌ చేశారు. కాగా, తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల చర్చల్లో విభజన అంశాన్ని పొరపాటున పెట్టారని ఆయన చెప్పారు.