జగన్ జిల్లా పర్యటనకు హోమ్ మంత్రి సుచరిత గైరాజర్ 

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో అక్షయపాత్ర వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత గైర్హాజరు కాగా, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, మంత్రులు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అక్షయపాత్ర నేషనల్‌ చైర్మన్‌ మధు పండిత దాస్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగారు. అనంతరం వారికి స్వయంగా భోజనాలను వడ్డించారు. సిఎం స్వయంగా అక్కడి ఆహార పదార్థాలలో కొన్నిటిని రుచి చూశారు. తయారీ విధానాన్ని ముఖ్యమంత్రికి అక్షయపాత్ర ప్రతినిధులు వివరించారు.

ప్రభుత్వ భూమిలో కేంద్రీకృత వంటశాల, శ్రీకృష్ణ ఆలయం, గోశాల నిర్మిస్తున్న ఇస్కాన్‌ సంస్థ జిల్లాకి చెందిన హోం మంత్రి సుచరిత పేరును శిలాఫలకంపై ముద్రించలేదని, దీంతో ఆమె మనస్తాపానికి గురయ్యారని సమాచారం.

జిల్లా ప్రోటోకాల్ మంత్రిగా హోం మంత్రి సుచరిత ఉన్నారు. స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా ఇస్కాన్ సంస్థ వేయలేదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీరంగనాధ రాజుని సైతం నిర్వాహకులు మరిచారు. 

గురువారం ఆమె సిఎం జగన్‌ పర్యటనకు హాజరు కావాలని షెడ్యూల్‌ రూపొందించుకున్నారు. అయితే శిలాఫలకాలపై తన పేరు లేదని రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలియడంతో ఆమె ఈ పర్యటనలో పాల్గొనలేదని తెలుస్తోంది.