
యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్‌లోని భారతీయులను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించే ఆలోచన లేదని, అంతకంటే కూడా వారు సురక్షితంగా ఉండేలా చూడడంపైనే తాము దృష్టి పెడుతున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలను తక్షణం తగ్గించే చర్యలకు భారత్ మద్దతు ఇస్తుందని, నిరంతర దౌత్య చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియాకు చెప్పారు.
ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులతో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం టచ్‌లో ఉందని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి కారణంగా తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వదిలి వెళ్లాలని అక్కడి భారత ఎంబసీ మంగళవారం భారత పౌరులకు ముఖ్యంగా విద్యార్థులకు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాదు దేశంలోపల అనవసర ప్రయాణాలు మానుకోవాలని కూడా సలహా ఇచ్చింది. అయితే ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, భారతీయ విద్యార్థులు క్షేమంగా ఉండేలా చూడడమే తమ తొలి ప్రాధాన్యత అని బాగ్చీ సష్టం చేశారు. వారిని వెంటనే ఖాళీ చేయించే ఉద్దేశం లేదని, ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని కూడా ఆయన చెప్పారు.
ఎయిర్ బబుల్ ఏర్పాటు కింద ఉక్రెయిన్, భారత్ మధ్య పరిమిత సంఖ్యలోనే విమానాలు ఉన్నాయని బాగ్చీ గుర్తు చేస్తూ, అయితే ప్రస్తుతం విమానాల సంఖ్య, ప్రయాణికుల సంఖ్యపై పరిమితి ఎత్తివేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు చార్టర్ విమానాలను నడపాల్సిందిగా విమాన యాన సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా ఎంత గట్టిగా వాదిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయవచ్చన్న భయాలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడాలని అనుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
అయితే రష్యా ప్రభుత్వం మాత్రం ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ తమకు లేదని అంటోంది.‘గత కొంత కాలంగా అమెరికా, దాని మిత్ర దేశాలు భయపడుతున్నట్లుగా ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ మాకు లేదు’ అని రష్యా విదేశాంగ శాఖఒక బహిరంగ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సరిహద్దులనుంచి కొన్ని బలగాలు తమ బేస్‌లకు మళ్లుతున్నాయని చెప్పడం ద్వారా రష్యా ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవానికి అది ఉద్రిక్తంగా ఉన్న ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బలగాలకు అదనంగా మరో 7 వేల బలగాలను పంపించిందని నాటో మిత్ర దేశాలు ఆరోపించాయి.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు