రవిదాస్‌ దేవాలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు

ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు రవిదాస్‌ జీవితం అందరికీ మార్గదర్శకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతో పాటుగా వీడియోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ట్విట్టర్‌లో ….”రవిదాస్‌ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సాధువు చూపిన మార్గాన్ని అనుసరించి సమానత్వం, సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సహకరిద్దాం” అని ట్వీట్‌ చేశారు.

అంతేకాదు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సెలవు ప్రకటించింది. గురు రవిదాస్‌ 15 లేదా 16వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో ప్రముఖంగా ఉంటాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పౌర్ణమిని గురుదాస్‌ జయంతిగా జరుపుకుంటారు. గురు రవిదాస్‌ లింగ లేదా కులం ఆధారంగా చేసే విభజనను వ్యతిరేకించారు. లింగ సమానత్వం కోసం కృషి చేశారు. అంతేకాదు రవిదాస్‌ని  ప్రముఖ భక్తి ఉద్యమ కవయిత్రి మీరా బాయికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొందరు అంటుంటారు.