దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కతోనా కేసులు భారీగా తగ్గాయి. 30 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27 వేల 409 కేసులు రాగా..347 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
 
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 82 వేల 817 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4 లక్షల 23 వేల 127 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 173.42 కోట్లకు పైగా టీకా డోసులు కేంద్రం పంపిణీ చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గాయని కేంద్రం చెప్పింది.  వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. 
 
కాగా, దేశంలోని పిల్లల కోసం హైదరాబాద్‌ నుంచి మరో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేందుకు మార్గం సుగమమైంది. భాగ్య నగరానికి చెందిన బయొలాజికల్‌-ఈ కంపెనీ అభివృద్ధిచేసిన కోర్బెవ్యాక్స్‌ టీకాను 12-18 ఏళ్లలోపు పిల్లలకు అత్యవసర ప్రాతిపదికన అందించవచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ సి ఫారసు చేసింది.
 
 కొన్ని షరతులకు లోబడి దీన్ని పిల్లలకు ఇవ్వొచ్చని పేర్కొంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సోమవారం నివేదించింది. దీన్ని పరిశీలించి త్వరలోనే డీసీజీఐ తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  
 
చెన్నైలో విమానాలకు, లోకల్ రైళ్లకు తొలగిన ఆంక్షలు 
 
కరోనా నిబంధనల సడలింపుతో చెన్నై నగరంలో గుమ్మిడిపూండి, అరక్కోణం, తిరువళ్లూరు, చెంగల్పట్టు మార్గాల్లో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సబర్బన్‌ రైళ్ల సర్వీసులు ప్రారంభ మయ్యాయి. కరోనా వ్యాప్తికి ముందున్నట్లే ఈ మార్గాల్లో రోజూ 658 రైలు సర్వీసులు నడుపుతున్నట్లు సబర్బన్‌ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. 
 
కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి కారణంగా కరోనా  నిబంధనల నడుమ తక్కువ సంఖ్యలో ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే సబర్బన్‌ రైళ్ళను నడిపారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు తొంభైశాతం మేరకు సడలించడంతో గతంలా సబర్బన్‌ రైళ్ళను పూర్తి స్థాయిలో నడపాలని ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు డిమాండ్‌ చేశారు. వీరి అభ్యర్థన పరిశీలించిన సబర్బన్‌ రైల్వే ఉన్నతాధికారులు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో రైళ్లను నడిపేందుకు అంగీకరించారు.
 
 మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్‌ నిబంధ నలను సోమవారం నుంచి పూర్తిగా తొలగించారు. గతంలా పూర్తి సడలింపులతో విదేశీ ప్రయాణికులకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై కొవిడ్‌ టెస్టులు, ఐసోలేషన్‌లు ఉండవని, థర్మల్‌ స్కాన్‌ మాత్రమే నిర్వహిస్తామన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు విదేశీ ప్రయాణికులకు కరోనా ముందస్తు వైద్యపరీక్షలను రద్దు చేశారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్టు ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్లం చేశారు.