రేపు నింగిలోకి పిఎస్‌ఎల్‌విసి -52 రాకెట్‌

పిఎస్‌ఎల్‌విసి -52 రాకెట్‌ నింగికెగరటానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం కానుంది.ఈ ప్రక్రియ 25.30 గంటలు కొనసాగి సోమవారం తెల్లవారుజామున 5.59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథన్‌ షార్‌కు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఎస్‌ఎల్‌విసి – 52 ప్రయోగం అత్యంత కీలక ప్రయోగమని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగ పనులు సాఫీగా సాగుతున్నాయని, త్వరలోనే ప్రయోగిస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో పిఎస్‌ఎల్‌విసి-53 రాకెట్‌ ప్రయోగం కూడా ఉంటుందని చెప్పారు. కరోనా సమయంలో కష్టపడి పని చేసిన శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు.

ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ఇఎస్‌ఒ -04ను లాంచింగ్‌ చేయనున్నారు. పిఎస్‌ఎల్‌విసి సిరీస్‌లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. రిశాట్‌ -1 అని కూడా పిలిచే ఇఒఎస్‌ -4 కాకుండా మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్‌ శాటిలైట్‌ వెహికల్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. 

ఐఎన్‌ఎస్‌ -2డి భారత్‌, భూటాన్‌ జాయింట్‌ శాటిలైట్‌ ఐఎన్‌ఎస్‌ -2బి పూర్వగామి. వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై ఉండే తేమ,హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహమే ఇఒఎస్‌ -04 అని ఇస్రో తెలిపింది.