బుర్ఖా చీకటి యుగపు పవిత్ర బెల్ట్ వంటిది !

ఎంపికలు తీసివేయబడినప్పుడు మాత్రమే బుర్ఖా/హిజాబ్ ధరించాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. “ఇస్లాం రాజకీయం వలే, బుర్ఖా/హిజాబ్ కూడా నేడు రాజకీయం అయింది” అని ఆమె పేర్కొన్నారు. మత హక్కు , విద్యా హక్కుకు అతీతం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు.

బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. బుర్ఖా, హిజాబ్ ఎప్పటికీ స్త్రీ ఎంపిక కాదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుండగా కర్నాటకలోని ఉన్నత విద్యా సంస్థల్లో తమని హిజాబ్ (శిరోవస్త్రం)తో ప్రవేశించనివ్వాలని అక్కడి కొందరు ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

అది కాస్తా తర్వాత నిరసనలు, ప్రతి నిరసనలకు దారితీసింది. “వేరే మార్గం లేనప్పుడే వారు హిజాబ్‌ను ధరించక తప్పదు. ఇస్లాం రాజకీయం మాదిరిగా నేడు బుర్ఖా/హిజాబ్ కూడా రాజకీయం అయిపోయింది” అని తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో రాశారు.

 “ముస్లిం మహిళలు బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్ (చేస్టిటి బెల్ట్) మాదిరిగా చూడాలి. సంఘర్షణలను అరికట్టడానికి ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి యూనిఫారం అవసరమని నేను నమ్ముతున్నాను. మత హక్కు, విద్యా హక్కు కంటే ఎక్కువేమి కాదు” అని తస్లీమా న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు.

హిజాబ్ వివాదం కాదు… కుట్ర

కాగా,  ప్రస్తుతం వివాదంగా సాగుతున్న హిజాబ్ , సంస్థకు సంబంధించిన ఒకరు నిబంధనలు, డ్రెస్‌కోడ్, పాటించాలా? వద్దా అన్న చాయిస్ ఎంచుకునే ప్రశ్న కాదని, ఇదొక కుట్రని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. 
 
కర్ణాటకలో దీనిపై సాగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ న్యూఢిల్లీ లోని పాత్రికేయులతో దీన్ని వివాదంగా తీసుకోరాదని, ఇదో కుట్ర అని ఆరోపించారు. ముస్లిం బాలికలు ఎక్కడైనా బాగానే వ్యవహరిస్తారని, అయితే వారికి ప్రోత్సాహం అవసరమని ఆయన చెప్పారు. హిజాబ్‌ను మహిళలు తిరస్కరించే సంఘటనలు ఇస్లాం చరిత్రలో ఉన్నాయని పేర్కొన్న తరువాత ఆయన ఈ మేరకు స్పందించారు.