ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో క్వాడ్ దేశాలు

ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో,  ఈ ప్రాంతంలో చీలికలు తెచ్చేందుకు క్వాడ్ దేశాలు  ప్రయత్నిస్తున్నాయని చైనా ఆరోపించింది. ఈ నెల 11న మెల్‌బోర్న్‌లో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో చైనా  మండిపడింది.  భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే.
 క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) దేశాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ లో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశానికి ఎజెండాను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 11న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. మన దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సదస్సుకు హాజరవుతారు.
ఇండో-పసిఫిక్ ప్రజాస్వామిక దేశాల మంత్రుల స్థాయి సమావేశం జరగడం ఇది నాలుగోసారి. గత సెప్టెంబరులో జరిగిన ఈ నాలుగు దేశాల అధినేతల సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఫిబ్రవరి 11న జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళపై చర్చించనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాలని మీడియా కోరినపుడు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ, అమెరికా ఓ ప్రజాస్వామిక దేశంగా తన కీర్తిప్రతిష్ఠలను చాలా కాలం క్రితమే కోల్పోయిందని ధ్వజమెత్తారు.
అమెరికా తరహా ప్రజాస్వామిక ప్రమాణాలను అంగీకరించాలని ఇప్పటికీ ఇతర దేశాలను నిర్బంధించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.  ప్రజాస్వామిక విలువల మధ్య విభజన రేఖలు గీస్తూ, చిన్న చిన్న బృందాలను కలుపుతోందని ఆరోపించారు.ఇది ప్రజాస్వామిక విలువలకు పరిపూర్ణంగా ద్రోహం చేయడమేనని ఆరోపించారు.  ఘర్షణలను సృష్టించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
శాంతి, అభివృద్ధి, సహకారాలను చైనా కోరుకుంటోందని పేర్కొన్నారు. విస్తృత, సమ్మిళిత, ఏదైనా ఇతర దేశాన్ని లక్ష్యంగా చేసుకొనని ఆసియా-పసిఫిక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను తాము నిర్మిస్తామని స్పష్టం చేశారు. అమెరికా, సంబంధిత ఇతర దేశాలు పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటాయని, సావధానంగా ఉంటూ, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడనాడుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ దేశాల మధ్య చీలికలు తేవడం ఆపుతాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరత, సౌభాగ్యాల కోసం కృషి చేస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంపై తన ప్రభావాన్ని తగ్గించడానికి క్వాడ్ దేశాలు ప్రయత్నించే అవకాశం ఉందని చైనా ఆందోళన చెందుతోంది.