కర్నాటక కాలేజిల్లో హిజాబ్‌ -కాషాయ కండువాల వివాదం

కర్నాటకు చెందిన ఉడుపి జిల్లాకు చెందిన కుందాపూర్‌లోని జూనియర్ కాలేజిల్లో హిజాబ్‌ – కాషాయ కండువాలు వివాదం కొనసాగుతున్నది. అక్కడి రెండు జూనియర్ కాలేజిల్లో విద్యార్థులు యూనిఫారమ్‌లను ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారు. అక్కడి రాష్ట్ర విద్యా శాఖ శనివారం యూనిఫారం తప్పనిసరి అన్న ఉత్తర్వులను జారీచేసింది. 

కుందాపూర్‌లోని వెంకటరమణ కాలేజ్‌కు చెందిన విద్యార్థుల బృందం  కాషాయ కండువాలు ధరించి ఊరేగింపుగా కాలేజ్‌కు చేరుకున్నారు. కాగా వారిని కాలేజ్‌లోకి ప్రవేశించనివ్వకుండా కాలేజ్ ప్రిన్సిపాల్, అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు వారు, “ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు ప్రవేశించినట్లయితే, మేము కూడా కాషాయ కండువాలు ధరించి తరగతుల్లోకి ప్రవేశిస్తాం” అని స్పష్టం చేశారు. 

తరగతులకు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ లేకుండా ప్రవేశించేట్లు అనుమతిస్తామని ప్రిన్సిపాల్ వారి హామీ ఇచ్చాకే వారు కాషాయ కండువాలును తీసేసి తరగతులకు హాజరయ్యేలా ఒప్పుకున్నారు.

ఇదిలా ఉండగా కుందాపూర్ ప్రభుత్వ ప్రీయూనివర్శిటీ కాలేజ్ వద్దకు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రాగా, వారికి ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఉత్తర్వుల గురించి వివరించారు. దాంతో వారు తాము హిజాబ్ ధరించే తరగతులకు వస్తామని భీష్మించడంతో, ప్రిన్సిపాల్ వారిని వేరేగా ఏర్పాటుచేసిన ప్రత్యేక తరగతికి పంపించారు.

మరోవంక, ఉడుపిలోని కుందాపూర్ పట్టణంలో విద్యార్థులు హిజాబ్‌- కాషాయ కండువాల నిరసనలు ప్రదర్శిస్తున్న చోటికి వచ్చి కత్తులు ఝళిపించిన ఇద్దరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని అబ్దుల్ మాజీద్ (32), రజబ్(41)గా గుర్తించారు. వారు కుందాపూర్ తాలుకాలోని గంగొల్లికి చెందినవారు. 

కాగా ఈ కేసులో ఇంకా అనుమానితులుగా ఉన్న మరో ముగ్గురి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మాజీద్ ఇప్పటికే ఆరు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. ఇక రజబ్‌పై గంగొల్లిలో ఓ పెండింగ్ కేసు ఉంది. కుందాపూర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై వివిధ పినల్ కోడ్‌ల కింద కేసు నమోదయిందయిందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

‘హిజాబ్’ వివాదంపై కర్నాటక హైకోర్లు విచారణ చేపట్టడానికి ముందుగా  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అందరూ శాంతిని పాటించాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత తన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని హామీ కూడా ఇచ్చారు. 

కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు తప్పనిసరి యూనిఫారం ధరించాలని విద్యా సంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పాటించాల్సిందేనని ఆయన తెలిపారు. “అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు (యూనిఫారంపై) అనుసరించాల్సిందే. రేపు కోర్టు తీర్పు వస్తుంది, దాని ప్రకారం మేము చర్యలు చేపడతాం” అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా కాలేజ్‌లో హిజాబ్ ధారణపై ఆంక్షలను ప్రశ్నిస్తూ ఉడుపిలోని ప్రభుత్వ ప్రీయూనివర్శిటీ కాలేజ్‌లోని ఐదుగురు విద్యార్థినులు దాఖలుచేసిన పిటిషన్స్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. కర్నాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న యూనిఫారంను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

కాగా కర్నాటక తీరప్రాంతంలో గత కొన్ని రోజులుగా హిజాబ్ వస్త్రధారణలో వచ్చిన ముస్లిం విద్యార్థినుల విషయంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. దానికి ప్రతిగా, నిరసనగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి తరగతులకు వచ్చారు. 

జనవరి 1వతేదీన కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకాకుండా నిషేధించారు. కళాశాల యాజమాన్యం నిషేధానికి కారణం వెనుక కొత్త యూనిఫాం విధానాన్ని ఉదాహరించింది. హిజాబ్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో ఈ సమస్య ఇప్పుడు ఉడిపిలోని ఇతర ప్రభుత్వ కళాశాలలకు వ్యాపించింది.