కాళేశ్వరం బిడ్డింగ్ ప్రక్రియతో నాబార్డుకు సంబంధం లేదు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ సహా వివిధ విభాగాలు మంజూరు చేసిన అనుమతులను పరిశీలించి, క్షేత్రస్థాయిలోనూ పర్యటించిన తర్వాతనే నాబార్డ్ రుణం మంజూరు చేసిందని కేంద్రం తెలిపింది.  లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ కాళేశ్వరం బిడ్డింగ్ ప్రక్రియతో నాబార్డ్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
2019-20లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్ రూ. 1,500 కోట్లు మంజూరు చేయగా, రూ. 795.54 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 2020-21లో రూ. 4,676.83 కోట్లు మంజూరు చేయగా, రూ. 2,107.82 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. రుణం మంజూరు చేయడం కంటే ముందు నాబార్డ్ బృందం ప్రి-శాంక్షన్ మానిటరింగ్ విజిట్ కూడా నిర్వహించినట్టు వెల్లడించారు.
అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ‘కాళేశ్వరం ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్)’ నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియతో నాబార్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నిజానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కాళేశ్వరం ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటిటెడ్  నాబార్డ్‌ను ఆశ్రయించిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు చెక్‌డ్యాములు, గ్రామీణ మౌలిక వసతులు, గోదాముల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కూడా నాబార్డ్ ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు. ఖమ్మంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం రూ. 28.83 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్టు వెల్లడించారు.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు కూడా నాబార్డ్ ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థలకు రుణాలు అందజేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.