కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎం ఎల్ సి ఎన్  రామచంద్రరావు వెల్లడించారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు. ఫిబ్రవరి 14నుంచి కోర్టుల ముందు ‘చేంజ్ సీఎం.. నాట్ కానుస్టూషన్’ పేరుతో బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసన తెలిపితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడ్తున్నారన్నారని రామచంద్రరావు వాపోయారు. ప్రధాని మోదీ బాడీ షేమింగ్‌పై కేసీఆర్ కామెంట్స్‌ను ఖండిస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ అంబేద్కర్‌ను అవమానించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారనీ చెబుతూ “దీనిని  దేశ వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌పై బీజేపీ ధర్మ యుద్ధాన్ని  ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని రామచంద్రరావు వెల్లడించారు.

 అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదు

కాగా,అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదన్నారు బండి సంజయ్. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరోపించారు. రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యంగా  ఉందని ఆయన ధ్వజమెత్తారు. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే ఉద్దేశంతో.. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని తెలిపారు.
ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో… అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెబుతున్నారని దుయ్యబట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు.
 
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు స్పందించాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా న్యాయవాదులు పోరాడాలని సూచించారు.