1000వ వన్డేలో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

తొలి వన్డేలో వెస్టిండీస్‌పై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా కేవలం నాలుగు వికెట్లను మాత్రమే నష్టపోయి 28 ఓవర్లలో ఛేదించేసింది. 

భారత సారథి రోహిత్‌ శర్మ (60) అర్ధశతకంతో రాణించాడు. మరో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించడం గమనార్హం. తొలి వికెట్‌కు ఇషాన్‌తో కలిసి 84 పరుగులు జోడించిన అనంతరం జోసెఫ్‌ (13.1వ ఓవర్‌) బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. 

రోహిత్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ (8) వరుసగా రెండు ఫోర్లు బాది ఊపు మీద కనిపించాడు. అయితే జోసెఫ్‌ (13.5) బౌలింగ్‌లోనే కీన్‌ రోచ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. స్వల్ప వ్యవధిలో ఇషాన్‌ (28)తోపాటు రిషభ్‌ పంత్‌ (11) పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ కష్టాల్లో పడినట్లు అనిపించింది. 

అయితే సూర్యకుమార్‌ (34లి), దీపక్‌ హుడా (26లి) మరో వికెట్‌ను పడనీయకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జోసెఫ్‌ 2, హుస్సేన్‌ ఒక వికెట్‌ తీశారు.
భారత బౌలర్ల ధాటికి ఒకానొక దశలో వెస్టిండీస్‌ 100లోపే చుట్టేసేలా కనిపించింది. మరీ స్వల్ప స్కోరుకే పరిమితం కాకుండా 176 పరుగులు చేయడంలో ఆల్‌రౌండర్‌ జాసన్‌ హౌల్డర్‌ (57), అలెన్‌ (29) కీలక పాత్ర పోషించారు. 79 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయిన విండీస్‌ను వీరిద్దరే ఆదుకున్నారు.

ఎనిమిదో వికెట్‌కు మరో 78 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ భాగస్వామ్యం విడిపోయాక విండీస్‌ను ఆలౌట్‌ చేయడానికి టీమ్‌ఇండియాకు ఎంతోసేపు పట్టలేదు. చాహల్‌ (4/49), వాషింగ్టన్‌ సుందర్‌ (3/30) విండీస్‌ పతనంలో ముఖ్య భూమిక పోషించారు.

వెస్టిండీస్‌ బ్యాటర్లలో షై హౌప్‌ 8, బ్రాండన్‌ కింగ్‌ 13, డారెన్‌ బ్రావో 18, బ్రూక్స్‌ 18, పొలార్డ్‌ డకౌట్‌, జోసెఫ్‌ 13 పరుగులు చేశారు. టీమ్‌ఇండియా బౌలర్లలో చాహల్‌ 4, సుందర్‌ 3, ప్రసిధ్‌ 2, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.