వివేకా హత్య కేసులో నిందితుడిగా వైసిపి నేత శంకర్‌రెడ్డి

వివేకా హత్య కేసులో నిందితుడిగా వైసిపి నేత శంకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. శుక్రవారం పులివెందుల కోర్టులో ఈ మేరకు రెండో ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేసింది.
ఈ కేసు నుండి శివశంకర్‌రెడ్డిని తప్పించడంకోసం వైసీపీ నేతలు విఫల ప్రయత్నాలు చేసిన్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామంతో ఈ కేసులో కీలక నిందితులను బైటకు తీసుకొచ్చేందుకు సిబిఐ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది.  2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
తన తండ్రి హత్య కేసులో సిట్‌ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వం అభ్యంతరాలను ఖాతరు చేయకుండా కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 మార్చి 11న కీలక నిర్ణయం తీసుకుంది.
రంగంలోకి దిగిన సీబీఐ కడప, పులివెందుల కేంద్రంగా విచారణ చేపట్టింది. వివేకా అత్యంత సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న, మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి, యాదాటి సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి సహా పలువురిని విచారించింది.
దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. నిరుడు నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారు లు అదుపులోకి తీసుకున్నారు. 18న పులివెందుల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. నాటి నుంచి రిమాండ్‌ ఖైదీగా కడప సెంట్రల్‌ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో తుది చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది.
ప్రొద్దుటూరు న్యాయమూర్తి ఎదుట దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి రావడంతో వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి చవిచూశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి మద్దతివ్వని కారణంగానే ఓడిపోయానని వివేకా తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించారు.
‘పులివెందులకు వస్తుండగా మార్గమధ్యంలో ఎర్రగంగిరెడ్డికి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. మేం వివేకా ఇంటికి వెళ్లే సమయానికి గంగిరెడ్డి వచ్చారు. ఆయన్ను వెంటబెట్టుకొని ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు నన్ను మోసం చేశారని, అన్ని విషయాలు నాకు తెలిశాయని మధ్యలో నే గంగిరెడ్డిపై వివేకానందారెడ్డి మండిపడ్డారు’.
`అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లాక.. అక్కడే ఉన్న శంకర్‌రెడ్డిని నీవు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు.. నీ అంతు చూస్తానని హెచ్చరించారు. 2019 ఫిబ్రవరి 10న సునీల్‌ నన్ను, ఉమాశంకర్‌రెడ్డిని గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లాడు. మేం లోపలకు వెళ్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తు లు బయటకు వచ్చారు’.
`మేము లోపలికి వెళ్లాక.. బెంగళూరు భూసెటిల్‌మెంట్‌లో నాకు ఇవ్వాల్సిన డబ్బు వివేకానందారెడ్డి ఇవ్వలేదు. ఆయన్ను నువ్వు చంపేయ్‌ అని అన్నాడు. ఆయన దగ్గర చాలా రోజులుగా పనిచేశా.. హత్య చేయను అన్నాను..’
`నువ్వొక్కడివే కాదు మేము ఉంటాం.. దీని వెనకాల పెద్దవాళ్లు అవినాశ్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఉన్నా రు. హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు.. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తానని గంగిరెడ్డి చెప్పాడు. తరువాత సునీల్‌ నాకు రూ.కోటి అడ్వాన్స్‌గా ఇచ్చాడు.. మళ్లీ ఇస్తానంటూ రూ.25 లక్షలు సునీల్‌ తీసుకున్నాడు. మిగిలిన రూ.75 లక్షలు నా స్నేహితుడు మున్నా వద్ద ఉంచాను’ అని దస్తగిరి తెలిపారు