ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు సఫలం

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ నిర్వహించిన సుదీర్ఘ చర్చలు సఫలం కావడంతో నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెను పిఆర్‌సి పోరాట కమిటీ విరమించింది. పిఆర్‌సి పోరాట కమిటీ ప్రతినిధులతో మంత్రుల కమిటీ సచివాలయంలో శనివారం రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిపింది.
ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎ, ఐఆర్‌ రికవరీ, పిఆర్‌సి కాలపరిమితి ఐదేళ్లు, సిసిఎ, సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలతోపాటు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌పై చర్చించారు. ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి మించి ఇచ్చే ప్రసక్తేలేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
ఐఆర్‌ రికవరీ చేయబోమని, ఐదేళ్ల పిఆర్‌సి విధానమే ఉంటుందని, హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లలో మార్పులకు మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం ఫిట్‌మెంట్‌, పిఆర్‌సి అమలు తేదీతోపాటు హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చర్చలలో కొంత ప్రతిష్టంభన నెలకొంది.
ఈ నేపథ్యంలో పిఆర్‌సిని 2018 జూలై ఒకటి నుంచి అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అయితే, మంత్రుల కమిటీ మాత్రం ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లపైనే సుమారు నాలుగైదు గంటలపాటు చర్చలు జరిగాయి.
జనాభా ప్రాతిపదికన నాలుగు రకాల హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లను మంత్రుల కమిటీ ప్రకటించింది. హెచ్‌ఆర్‌ఎను కనీసం 12 శాతం నుంచి ప్రారంభించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతిపాదించగా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది.
దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు 10, 12, 16 శాతం స్లాబ్‌లను అమలు చేయాలని, సచివాలయం, హెచ్‌ఓడి ఉద్యోగులకు 24 శాతంగా ఉంచాలని సూచించింది. అందుకు కూడా మంత్రుల కమిటీ ససేమిరా అంది.
50 వేల జనాభా ఉన్న ప్రాంతాల వారికి 8 శాతం హెచ్‌ఆర్‌ (శ్లాబ్‌ 10 వేలు), 50,000 – 2 లక్షల జనాభా ఉంటే 9.5 శాతం, (శ్లాబ్‌ 10 వేలు), 2-5 లక్షలకు 13.5 శాతం (శ్లాబ్‌ 12 వేలు), 5 లక్షలపైన జనాభా ఉంటే 16 శాతం (శ్లాబ్‌ 15 వేలు), సచివాలయుం, హెచ్‌ఓడి ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఎ ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది.
ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ తర్వాతే కొత్త పిఆర్‌సిని అమలు చేస్తామని కూడా తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నేతల మినహా, స్టీరింగ్‌ కమిటీలోని సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రుల కమిటీ, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.