సీఎం కేసీఆర్ పై నిరసనల సెగ.. నేడే బిజెపి దీక్షలు 

రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమవుతోంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీఎస్పీ, దళిత సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. 
 
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు నేతలు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపి  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసి అధ్యక్షుడు రేవంత్ రె్డ్డి, ఎమ్మెల్యే సీతక్క, ప్రొ.కోదండరాం, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  తదితరులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 
 
కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 70 వేల పుస్తకాలు చదివానంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  
 
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను మార్చే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.  అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి కల్వకుంట్ల రాజ్యాంగం తెస్తారా అంటూ మండిపడ్డారు. 
రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు. ఇంకో సారి రాజ్యాంగం గురించి మాట్లాడితే చూరచూర అవుతావు బిడ్డా..’’ అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. బుధవారం సంజయ్‌ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారత రాజ్యాంగాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడుతున్నదని, అభ్యంతరాలు ఉంటే చెప్పకుండా రాజ్యాంగాన్నే తిరగ రాయాలనడం సరికాదని చెప్పారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని గతంలో కొన్ని పార్టీలు భయభ్రాంతులకు గురిచేశాయని, ఇప్పుడు బీజేపీ రాజ్యాంగాన్ని తిరగ రాసిందా? అని నిలదీశారు. గతంలో ఇందిరా గాంధీ కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను మార్చేందుకు కుట్ర పన్ని భంగపడ్డారన్నారు. ఆఫ్ర్టాల్‌ కేసీఆర్‌ ఎంతని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తారని సంజయ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష చేపట్టాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు.
‘‘అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కూడా మార్చాలా? నీ మాటలపై దేశమంతా చర్చ జరగాలా? అవినీతి సామ్రాట్టువు నువ్వు. గుర్తు పెట్టుకో. దేశంలో చర్చ జరిగేది నీ అవినీతి పైనే’’ అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తాను సీఎం అయిన కేసీఆర్‌.. రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని దుయ్యబట్టారు. ఏనాడైనా అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొన్నాడా? అని ప్రశ్నించారు.
 
  రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్‌కు దాని స్థానంలో కల్వకుంట్ల రాజ్యాంగం, రాచరిక పాలన కావాలా? అని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తీసేయాలంటూ మాట్లాడిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ను అవమానించారని మండిపడ్డారు. 
 
 రాజ్యాంగంలో అంబేడ్కర్‌ అందరికీ సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్‌ 3 ద్వారానే వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుచేటన్నారు.