బడ్జెట్ లో తెలంగాణకు రూ 36 వేల కోట్లు

బడ్జెట్​ లెక్కల ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 36 వేల కోట్లు తెలంగాణకు విడుదలవనున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి  రూ. 52 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో భారీ  అంచనాలు వేసుకుంది. ఆర్థిక సంవత్సరానికి  మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో  కేంద్రం ఇచ్చే  నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకుంది. 

తెలంగాణ, ఏపీలోని గిరిజన  యూనివర్సిటీలకు రూ. 40 కోట్లు కేటాయించింది. ప్రతి ఏడాది కేంద్రం నుంచి  పన్నుల వాటాతో (టాక్స్​ డెవల్యూషన్)​ పాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​ల నిధులు రాష్ట్రాలకు విడుదలవుతాయి. సెంట్రల్​ జీఎస్టీ, ఇన్​కమ్​ ట్యాక్స్,  సీజీఎస్టీ, కస్టమ్స్  ట్యాక్స్​, ఎక్సైజ్​ డ్యూటీ, సర్వీస్​ టాక్స్, కార్పొరేట్​ ట్యాక్స్​ల ద్వారా కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. 

ఫైనాన్స్​ కమిషన్​ నిర్ణయించిన వాటా ప్రకారం అందులో 2.1 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. ఈ బడ్జెట్ ప్రకారం పన్నుల వాటా కింద రూ. 17,165 కోట్లు వస్తాయి. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పరిహారం కింద రూ. 2,379  కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ఇప్పటికే సూచించింది. 

వీటికి తోడు కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్​ స్పాన్సర్డ్  స్కీమ్​ నిధులు ఈసారి దాదాపు  రూ. 11,800 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల  గ్రాంట్లు, హెల్త్ గ్రాంట్​, అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్​ గ్రాంట్​, స్టేట్​ స్పెసిఫిక్​ గ్రాంట్లతో పాటు జీఎస్టీ పరిహారం .. అన్నీ కలిపితే నిరుటి కంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెయ్యి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు మాత్రమే పెరిగే అవకాశముంది. 

ఈ ఏడాది హెల్త్ గ్రాంట్​ కింద రూ.419 కోట్లు, స్టేట్ పర్​ఫార్మన్స్​ ఆధారంగా ఇచ్చే​ స్పెసిఫిక్​ గ్రాంట్​ కింద రూ. 472 కోట్లు,  అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్​ ఇన్సెంటివ్​ కింద రూ. 1,665 కోట్లు రాష్ట్రానికి విడుదలవుతాయి.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 2,112 కోట్ల గ్రాంట్​ రిలీజవుతోంది. మెట్రో సిటీ హైదరాబాద్​కు ప్రత్యేకంగా రూ. 245  కోట్లు, విపత్తుల నిర్వహణ సాయానికి  రూ. 629 కోట్లు కేటాయించారు. గ్రామీణ్​ సడక్​ యోజనతో పాటు జ్యుడీషియరీ​ గ్రాంట్ల కింద  మరో రూ. 96  కోట్లు విడుదలవుతాయి.