బడ్జెట్ లో సేంద్రీయ వ్యవసాయ కారిడార్, సాగుకు డ్రోన్లు 

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ అయిన భారత దేశంలో ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

గంగా పరీవాహకప్రాంతం వెంబడి నేచురల్ ఫార్మింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధునిక పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు సంప్రదాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం జరిగేది.

గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పురుగుల మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటిని ఉపయోగించి పండించే ఉత్పత్తుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ క్రమంలో ‘జీరో బడ్జెట్ ఫార్మింగ్’, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ఎరువులు, పురుగుల మందుల వినియోగం లేకుండా పంటలు పండించడమే ‘జీరో బడ్జెట్ ఫార్మింగ్’. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రైతులు ఈ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటనతో ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించినట్లవుతుంది.

‘కిసాన్ డ్రోన్స్’ వినియోగం

వ్యవసాయ పనులుత్వరితగతిన పూర్తయ్యేలా ఈ రంగంలో యాంత్రీకరణను పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డ్రోన్ల సహకారంతో పురుగుల మందుల పిచికారీని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కిసాన్ డ్రోన్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. అలాగే పంటల మదింపు, భూ రికార్డుల డిజిటలైజేషన్ కోసం కూడా కిసాన్ డ్రోన్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ఉత్పత్తుల విలువ పెంపుకై స్టార్టప్‌లు

వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 600 నుండి 700కు పైగా అగ్రి స్టార్టప్‌లున్నాయి. వీటితో పాటుగా మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్‌లో ప్రకటన చేశారు. నాబార్డ్ సాయంతో వ్యవసాయ స్టార్టప్‌లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

అద్దెకు వ్యవసాయ పనిముట్లు

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైనది. అదే సమయంలో చిన్న, సన్నకారు రైతులు అధిక మొత్తం వెచ్చించి వ్యవసాయ యంత్రాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లను అందించడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిద్వారా వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడంతో పాటు రైతుకు పంటపై వచ్చే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

వ్యవసాయంకు రూ 1.32లక్షల కోట్లు 

వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1,32,513 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌‌తో పోలిస్తే ఇది 4.5 శాతం ఎక్కువ.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో హైటెక్ అగ్రి సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఫిషరీస్, అనిమల్ హస్బండరీ, డైరీయింగ్ మినిస్ట్రీకి రూ 6,407.31 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువ. 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేటాయింపులను 2.25 రెట్లు పెంచారు. తాజాగా రూ.2,941.99 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ–అటవీ పెంపకాన్ని ప్రోత్సహించడానికి, ఇందుకోసం సమగ్ర ప్యాకేజీని అమలు చేయడానికి ప్రభుత్వం చట్టపరమైన మార్పులు చేయనుందని నిర్మల చెప్పారు. ప్రాసెస్ చేయగల పండ్లు, కూరగాయలను రాష్ట్రాలు పండించాలని కోరారు.

వ్యవసాయ రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 16.5 లక్షల కోట్లుగా ఉన్న క్రెడిట్‌‌ టార్గెట్‌‌ను.. 2022– 23లో 18 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు నిర్మల ప్రకటించారు. గతేడాది టార్గెట్‌‌లో 75 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.

వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పులు

యువత వ్యవసాయ రంగంపై మరింత పట్టు సాధించే దిశగా ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చి దిద్దేందుకు అడుగులు వేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత వ్యవసాయ సంబంధిత పాఠ్యాంశాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. 

వ్యవసాదయ వర్సిటీల్లో సిలబస్‌ను నేటి ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. రైతఉలకు డిజిటల్, హైటెక్ సేవలను అందించడం కోసం ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు, అనుబంధ సంస్థలతో పాటుగా ప్రైవేట్ అగ్రిటెక్ సంస్థలు, అగ్రి వాల్యూ చైన్‌ల భాగస్వాములతో కలిసి పిపిపి పద్ధతిలో ఒక స్కీమును ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆమె చెప్పారు.

అలాగే నానాటికి పెరిగిపోతున్న వంటనూనెల ధరలకు కళ్లెం వేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం దేశీయంగా నూనె గింజల ఉత్పత్తులను పెంచి దిగుమతులను తగ్గిస్తామని తెలిపారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశీయంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అడవుల్లో వ్యవసాయం చేసే ఎస్‌సి, ఎస్‌టి రైతులకుఆర్థిక సహాయం అందజేస్తారు.

ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్

భూ సంస్కరణల్లో భాగంగా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ‘ఒకే దేశం -ఒకే రిజిస్ట్రేషన్’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  వెల్లడించారు. ’ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్‌వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎన్‌జిడిఆర్‌ఎస్)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ‘మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్‌వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు’ సీతారామన్ తెలిపారు.

అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

అలాగే, ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.

ఆరోగ్యానికి 16 శాతం ఎక్కువ నిధులు 

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ. 86,200.65 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల కన్నా 16 శాతం ఇప్పుడు ఎక్కువ. 2021 -22 లో రూ. 73,931కోట్లు కేటాయించడగా, ఇప్పుడు మానసిక ఆరోగ్య క్షేమం కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ అనే పథకాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించడం విశేషం. 

ఇప్పుడు కేటాయించిన 86,200.65 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 83,000 కోట్లు కేటాయించగా, వైద్య పరిశోధన విభాగానికి రూ.3200 కోట్లు కేటాయించారు. మానసిక ఆరోగ్య సలహాలు, ఆరోగ్య భద్రత సేవల కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.