మళయాళం జమాత్ ఛానెల్ మీడియా వన్‌పై కేంద్రం నిషేధం

మలయాళం వార్తా చానెల్‌ మీడియా వన్‌ టివి ప్రసారాలు సోమవారం (జనవరి 31) నిలిచిపోయాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చానెల్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ‘భద్రతాపరమైన ఆందోళనలను’ కారణాలుగా మంత్రిత్వ శాఖ పేర్కొందని చానెల్‌ యాజమాన్యం తెలిపింది.
 
 ”భద్రతా కారణాల రీత్యా చానెల్‌ ప్రసారాలను అనుమతించడం లేదని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. అంతకుమించి వివరాలు ఇవ్వలేదని చానెల్‌ ఎడిటర్‌ ప్రమోద్‌ రామన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చానెల్‌ను పునరుద్ధరించుకోవడం కోసం మీడియా వన్‌ అత్యవసరమే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వుందని పేర్కొన్నారు. 
 
సాధ్యమైనంత త్వరలోనే ప్రేక్షకులను కలుసకుంటామని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి మా ప్రసారాలు నిలిపివేస్తున్నామని చెప్పారు. అయితే చానెల్‌కు పంపిన నోటీసులో ఈ చర్య తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది నిర్దిష్టంగా పేర్కొలేదు. 
 
ఇప్పటికే ఈ టీవీ ఛానెల్‌పై రెండు రోజుల పాటు నిషేధం విధించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మరోసారి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2021 నుంచి సెప్టెంబర్ 29,2031 వరకు టీవీ ఛానెల్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయాలని కేద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు మీడియా వన్‌ఛానెల్ దరఖాస్తు పెట్టుకుంది. ఈ దరఖాస్తును కేంద్ర హోం మంత్రిత్వశాఖ తిరస్కరించింది.
 
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తోసిపుచ్చాలని కోరుతూ చానెల్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు లైవ్‌ లా న్యూస్‌ పోర్టల్‌ తెలిపింది. ఎలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తమ చానెల్‌ పాల్పడలేదని, అందువల్ల ఈ లైసెన్స్‌ రద్దు ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ చానెల్‌ కోర్టుకెళ్ళిందని ఆ న్యూస్‌ పోర్టల్‌ పేర్కొంది. 
 
కేరళలో మీడియా వన్‌ చానెల్‌ చాలా ప్రజాదరణ పొందిన చానెల్‌. మాధ్యమమ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్‌కి చెందిన ఈ చానెల్‌లో పెట్టుబడిదారుల్లో చాలామంది కేరళ జమాత్‌ ఇ ఇస్లామికి చెందిన సభ్యులే. 
 
చానెల్‌ ప్రసారాలు ఇలా నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2020 మార్చిలో మీడియా వన్‌తో సహా మరో మలయాళం చానెల్‌ ఆసియా నెట్‌ ప్రసారాలు కూడా 48గంటల పాటు నిలిచిపోయాయి. ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలపై వార్తలను ప్రసారం చేసినందుకు ఈ చానెళ్ళ ప్రసారాలను నిలిపివేశారు. కొద్ది గంటల తర్వాత రెండు చానెళ్లను పునరుద్ధరించారు.