నాసిక బూస్టర్‌ డోసు టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌

కరోనాను అరికట్టడానికి ముక్కు ద్వారా తీసుకొనే  (ఇంట్రానాజల్ బిబివి 154 ) కొవాగ్జిన్ టీకా తుదిదశ ప్రయోగాలు జరిపేందుకు  క్లినికల్ ట్రైల్స్ కు   భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిసిఐ) అనుమతి ఇచ్చింది. దీనిని    భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. 

 బూస్టర్ డోసుగా ఈ ఇంట్రానాజల్ వ్యాక్సిన్ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని ఎంతవరకు పెంపొందిస్తుందో, అలాగే ఎంతవరకు భద్రత కల్పిస్తుందో యాధృచ్ఛిక బహుకేంద్రీకృత క్లినికల్ అధ్యయనం ద్వారా అంచనా వేస్తారు. 

న్యూడ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 ప్రకారం అనుమతి పొందిన కరోనా టీకాలకు ఇదివరకు ఎవరైతే తీసుకున్నారో ఆయా అభ్యర్థుల పైనే ఈ తుదిదశ ట్రయల్స్ నిర్వహిస్తారు. దేశం లోని ఎయిమ్స్ ఢిల్లీతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాల్లో ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఈ ట్రయల్స్ కోసం డిసెంబర్‌లో డిసిజిఐ నుంచి భారత్ బయోటెక్ అనుమతి కోరింది. 

రెండో దశ ట్రయల్స్ కోసం గత ఆగస్టులో డిసిజిఐ నుంచి అనుమతి లభించింది. దేశంలో కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నవారికి ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది. అయితే బూస్టర్ డోసును విస్తృతంగా పంపిణీ చేయాలంటే ఏ వ్యాక్సిన్ సరైనతో నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్‌ను తప్పనిసరిగా చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చింది. 

ఇదే సమయంలో రెండు డోసుల టీకా తీసుకున్న వారికి తమ ఇంట్రానాజల్ టీకా బూస్టర్ డోసుగా అనువైనదేనని భారత్ బయోటెక్ ఇటీవలనే వెల్లడించింది. ఇప్పుడు రెండు డోసులతోపాటు, బూస్టర్ డోసుకు కూడా ఎంతవరకు ఈ టీకా సామర్థం కలిగి ఉంటుందో ఈ మూడో దశ ట్రయల్స్ ద్వారా నిర్ధారణ అవుతుందని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి. 

ముక్కు ద్వారా తీసుకునే ఈ నాజల్ వ్యాక్సిన్ ఎంతో తేలికగా ఉంటుందని, సిరంజీలు, సూదులు అవసరం లేదని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మొత్తం వ్యయంపై దీని ప్రభావం ఉంటుందని భారత్ బయోటెక్ ఛైర్మన్ క్రిష్ణ ఎల్లా చెప్పారు. దీంతో వైరస్ బారిన పడకుండా కాపాడు కోవడమే కాకుండా, ఇన్‌ఫెక్షన్ సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని, భారత్ బయోటెక్ వెల్లడించింది.