ఉగ్ర దాడిలో 10 మంది పాక్ సైనికుల మృతి 

పాకిస్థాన్ దేశంలో చెక్ పోస్టుపై ఉగ్రవాదులు చేసిన దాడితో 10 మంది పాక్ సైనికులు మరణించారు.నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10మంది పాక్ సైనికులు మరణించారని పాక్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది.
 
ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా, పలువురు గాయపడ్డారు.మెరుపుదాడితో అప్రమత్తమైన పాక్ సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనేది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. ఇరాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్థాన్ చాలా కాలంగా హింసాత్మక తిరుగుబాటుకు నిలయంగా మారింది. 
ఈ ప్రాంతంలోని చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటు గ్రూపులు గతంలో పలు దాడులు జరిపాయి. జనవరి 5న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో భద్రతా బలగాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లలో ఇద్దరు సైనికులు, చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
 
దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమింపబోమని  పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ స్పష్టం చేశారు. మరణించిన వారి త్యాగాలు వృధా కావని, పాకిస్థాన్‌లో పూర్తి శాంతి తిరిగి వస్తుందని జనరల్ బజ్వా ప్రతిజ్ఞ చేశారు.