బేగంబజార్ లో కరోనా కలకలం

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా  వైరస్ విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.  వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపుతోంది.  మార్కెట్ లో ఎక్కువ కేసులు నమోదు కావడంతో వ్యాపారులు ఆందోళనగా ఉన్నారు. జనం రాకపోవడంతో మార్కెట్ డీలా పడింది. చాలా షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. 

బేగంబజార్ ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. అన్ని రకాల షాపులు  ఒకే దగ్గర ఉండటంతో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా చిన్న వ్యాపారులు, వినియోగదారులు హోల్ సేల్ కొనుగోళ్ళకు  ఇక్కడికి వస్తుంటారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్థానిక ప్రజలు  మాత్రమే బేగం బజార్ కు వస్తున్నారు.  బయటి వాళ్ళెవరూ కొనుగోళ్ళకు రాకపోవడంతో వ్యాపారం పడిపోయినదని వ్యాపారులు డీలా పడుతున్నారు. పెళ్లిళ్లు కూడా వాయిదా పడటంతో వివాహాల వ్యాపారం కూడా అంతగా కనిపించడం లేదు.

గతంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో బేగంబజార్ లో షాపులు స్వచ్చంధంగా మూసేశారు. దీంతో వ్యాపారం సరిగ్గా నడవక ఆర్థికంగా బాగా నష్టపోయారు వ్యాపారులు. ఆ పరిస్థితి నుంచి ఇంకా కోలుకోలేదనీ, ఇప్పుడు మరోసారి వ్యాపారం డల్ అయిందని అంటున్నారు. 

గత రెండు వేవ్స్ లోనూ లాక్ డౌన్ పాటించామనీ. ఈసారి అలాంటి సాహసం చేయలేమని చెబుతున్నారు. కొత్త వేరియంట్స్ తో  వేవ్ లు వస్తూనే ఉంటాయనీ, ఎంత కాలం షాపులు మూసేస్తామని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈసారి షాపుల టైమింగ్స్ కూడా తగ్గించలేదని చెబుతున్నారు.  

తమతో పాటు పనిచేసే వర్కర్స్, హమాలీలు కూడా డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారనీ., కరోనా  నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నారు. వినియోగదారులు కూడా మాస్క్ లు  పెట్టుకునేలా చూస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ భారీ ఆఫర్లతో పాటు ఫ్రీ డెలివరీ ఇవ్వడంతో  కరోనా భయంతో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. దాంతో తమ షాపుల్లో అమ్మకాలు తగ్గాయని అంటున్నారు బేగం బజార్ వ్యాపారులు.