ఐసిసి ఉత్తమ క్రికెటర్‌గా మంధాన

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వార్షిక అవార్డుల్లో మహిళల విభాగంలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకుంది. 2021 సంవత్సరానికి గాను ఐసిసి అవార్డులను ప్రకటించింది. 
 
 2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్‌గా ఎంపికైన స్మృతి రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టు 8 మ్యాచుల్లో రెండింటిలోనే విజయం సాధించింది.
 
ఈ రెండు మ్యాచుల్లోనూ మంధాన కీలక పాత్ర పోషించి జట్టుకు విజయాన్ని అందించింది. రెండో వన్డేలో 158 పరుగుల లక్ష్య ఛేదనలో 80 (నాటౌట్) పరుగులు చేయగా, చివరి టీ20లో అజేయంగా 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అలాగే, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సిరీసుల్లోనూ రాణించింది. తొలి పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసి టెస్టుల్లో తొలి శతకాన్ని నమోదు చేసింది.  
 
ఇక మహిళల విభాగంలో మంధాన, పురుషుల విభాగంలో షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు. మరోవైపు ఐసిసి మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దక్కించుకున్నాడు. 
 
వన్డే విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. పురుషుల ట్వంటీ20 విభాగంలో మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) ఉత్తమ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. 
 
మహిళల విభాగంలో టామీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్) ప్లేయర్ ఆఫ్‌ది ట్వంటీ20గా నిలిచింది. ఐసిసి ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సనా ఫాతిమా (పాకిస్థాన్) సొంతం చేసుకుంది.