ఎంపీ గౌతం గంభీర్‌కు కరోనా పాజిటివ్

భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కొవిడ్-19 బారిన పడ్డారు. ఎంపీ గౌతమ్ గంభీర్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ చెప్పారు.  2022 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా ఉన్నారు.తనకు కరోనా సోకినందున తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్ సూచించారు. 
 
‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించగా ఈరోజు నాకు కొవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షించుకోమని అభ్యర్థిస్తున్నాను. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని గంభీర్ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు.
 
కాగా,  దేశంలో వరుసగా ఐదు రోజులుగా మూడు లక్షలకు పైగా వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సంఖ్య నిన్న వచ్చిన 3.06 లక్షల కేసులతో పోలిస్తే 16.39 శాతం తక్కువ. 
 
అంటే గడిచిన 24 గంటల్లో 50,190 కేసులు తగ్గాయి. నిన్నటి వరకు 20 శాతం పైగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు కూడా భారీగా దిగొచ్చింది. నిన్న 20.7 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు.. తాజాగా 15.5 శాతానికి తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు మాత్రం 17.17 శాతంగా ఉంది. 
 
అయితే ఈ ఒక్క రోజులో 614 మంది కరోనా కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 2,67,753 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల లోడ్ 22,36,842గా ఉందని పేర్కొంది. మొత్తంగా రికవరీ రేటు 93.15 శాతానికి పెరిగిందని వివరించింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా 614 మంది మరణించారు. చికిత్స నుంచి కోలుకుని 2.67 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు.