టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్… విడుదల

టీడీపీ నేత బుద్దా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారణ అనంతరం రాత్రి 11 గంటల తర్వాత విడుదల చేసారు. ముఖ్యమంత్రి,  మంత్రి కొడాలి నాని, డీజీపీలకు  వ్యతిరేకంగా బుద్దా వెంకన్న హెచ్చరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. 
 
కాగా, కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘చలో గుడివాడ’ కార్యక్రమం చేపడతామని, అక్కడ జరిగిన వ్యవహారాలతో సంబంధం ఉన్నవారి బయటపెడతామని హెచ్చరించారు. 
 
మంత్రి పదవి ఊడగొట్టే ప్రయత్నాలు 
 
మరోవంక, తన మంత్రి పదవి ఊడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.  గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్‎లో ఏదో  క్యాసినో జరిగి పోయిందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని  సవాల్ చేశాక..  టీడీపీ నేతలు క్రమంగా మాట మార్చుతూ వచ్చారని ఎద్దేవా చేశారు. 
 
తొలుత కే కన్వన్షన్ సమీపంలో జరిగిందని, ఆ తర్వాత  గుడివాడలో జరిగిందని మాట మార్చారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని ఆయన హెచ్చరించారు.  చంద్రబాబును ప్రజలు రెండున్నర ఏళ్లక్రితం రాజకీయ సమాధి చేశారని ధ్వజమెత్తారు.  
 
“చంద్రబాబు ఇంటి గేటు టచ్ చేస్తే తనను చంపేస్తానని బుద్దా వెంకన్న మాట్లాడారు. చంద్రబాబు ఇంటి గేటు వద్ద బుద్దా వెంకన్నను కత్తి పెట్టుకుని కాపలా పెట్టారా?. చంద్రబాబు, లోకేష్‎ గురించి డీజీపీకి అంతా తెలుసు. బుద్దా వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి” అంటూ తీవ్రంగా మందలించారు. 
 
ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదని మంత్రి స్పష్టం చేశారు.   మంత్రిని మర్డర్ చేస్తా. డీజీపీకి వాటాలు ఉన్నాయని అంటే ఎవరైనా  ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అనేక అసభ్యకర కార్యక్రమాలను ఆ పార్టీ నేతలే చేశారని పేర్కొంటూ చంద్రబాబును అరెస్టు చేసి లోపలేయాలని సూచించారు.