సాగునీటి ప్రాజెక్ట్ లకు పర్యావరణ అభ్యంతరాలు

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్ట్ లకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
 
 ఎన్జీటీలో కేంద్ర పర్యావరణశాఖ నివేదిక దాఖలు చేసింది. 3 రిజర్వాయర్లు గాలేరు‌-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసిందిజ శ్రీశైలం జలాలను చిత్తూరుకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రతిపాదించింది.
 
 అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు చేపట్టారని బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రత్యామ్నాయ భూములు అందుబాటులో ఉన్నా పంట పొలాలను ముంచేలా రిజర్వాయర్లను రూపొందించారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ఈ మూడు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తమ వైఖరి తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులపై ఇకపై పనులు చేపట్టబోమని ఏపీ అండర్ టేకింగ్ ఇచ్చింది. కేంద్రం వైఖరితో రిజర్వాయర్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. 
 
కాగా, తెలంగాణలోని  శ్రీరాంసాగర్ వరదకాలువ ప్రాజెక్టుపై షోకాజ్ నోటీసులను జారీ చేసింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించడంతో పాటు అనుమతులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేశారని కేంద్రం పేర్కొంది. అనుమతుల ఉల్లంఘనలను ఎన్జీటీ సంయుక్త కమిటీ ధృవీకరిందంటూ కేంద్ర పర్యావరణ శాఖ నోటీసుల్లో వెల్లడించింది. 
 
గౌరవెల్లి సర్పంచ్ రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సంయుక్త కమిటీని  ఎన్జీటీ నియమించింది. ఉల్లంఘనలను కమిటీ ధృవీకరించింది. ప్రాజెక్టు దగ్గర నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ ఎన్జీటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ఎన్జీటీ వాయిదా వేసింది.