6 అర్ధరాత్రి నుంచి ఏపీ ఉద్యోగుల నిరవధిక సమ్మె

వేతన సవరణ అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధోరణిపట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే నెల 6 అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు.  ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించినా తిరస్కరించారు. ముందుగా పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు జీవోలను  రద్దు చేస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. దీనికి అంగీకరించేది లేదు’ అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ, ఎన్‌ఎంఆర్‌, ప్రజా రవాణాతోపాటు ఇతర అన్ని విభాగాలు, శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది. ఉద్యమంలో పెన్షనర్లూ భాగమయ్యారని ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు  ఇస్తామని స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. 
 
ఆదివారం విజయవాడలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ భేటీ సుదీర్ఘంగా జరిగింది. ఇందులో ప్రధాన జేఏసీ నేతలతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాల సంఘాల నేతలు పాల్గొన్నారు. సంప్రదింపులకు రావాలని మంత్రుల కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని  కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించింది.
పీఆర్సీ జీవోలను మొత్తం వెనక్కు తీసుకొని.. పాత వేతనాలు ఇస్తామంటేనే  మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండేలా సమ్మె నోటీసు రూపొందించేందుకు చర్యలు తీసుకున్నారు.
 తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఉద్యోగులు, నాయకులు కూడా జిల్లాల్లో ఎక్కడా వ్యక్తిగత దూషణలు, పరుషపదజాలంతో దూషణలు చేయకూడదని కమిటీ నిర్ణయించింది. హక్కుల సాధనకు శాంతియుతంగా పోరాటం చేయాలని తీర్మానించింది.