ఇద్దరు ఏపీ మంత్రులకు క‌రోనా

ఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు మంత్రులు కరోనాకు గురయ్యారు.  మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలకు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. గౌతమ్ రెడ్డికి  కరోనా సోకడం ఇది రెండో సారి. మొన్ననే క్యాబినెట్ సమావేశానికి మాస్క్ లేకుండానే హాజరయ్యారు.
 
గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మంత్రి మేకపాటి. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు మేకపాటి. దానితో కేబినేట్‌ కు హాజరై మంత్రుల్లో ఆందోళన మొదలైంది.
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు సంక్రాంతి సంబరాల అనంతరం ఈ నెల 17న ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. కేబినెట్‌ సమావేశం ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురువారం మరోసారి కరోనా టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌గా తేలింది. అయితే  సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు
 
కాగా, తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో కరోనా కలకలం రేపింది. ఏర్పేడు సమీపంలోని ఐఐటి ప్రాంగణంలో 75 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 45 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 
 
దీంతో ఐఐటి వసతి గృహాన్నే కొవిడ్‌ కేంద్రంగా మార్చారు. ఈ నెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం బిటెక్‌, ఎంటెక్‌, పిహెచ్‌డి చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో ఉన్నారని యాజమాన్యం తెలిపింది.
 
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,763 శ్యాంపిల్స్‌ను పరీక్షించగా, 12,926 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం బులిటెన్‌లో పేర్కొంది. విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరితో కలిపి మొత్తం ఐదుగురు కరోనాతో మరణించారు. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,538కి చేరింది. కరోనా నుంచి 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 73,143 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.77 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసులు వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో 4.26 కోట్ల మందికి మొదటి డోసు, 3.46 కోట్ల మందికి రెండో డోసు వేయగా, ప్రికాషన్‌ డోసు 4.66 లక్షల మందికి వేసినట్లు అధికారులు తెలిపారు.