కొల్లాపూర్‌ జాతీయ రహదారి డిపిఆర్ కు ఆమోదం 

కొల్లాపూర్‌ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం డిపిఆర్ ను ఆమోదించడంతో తెలుగు రాష్ట్రాలలో మరో జాతీయ లింక్ రహదారికి వేగంగా  అడుగులు ప్రారంభమయ్యాయి. 2021లో ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.  రహదారి నిర్మాణానికి రూ.600 కోట్లు, సోమశిల సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
డీపీఆర్‌ కోసం వెంటనే టెండర్లు పిలిచింది. తాజాగా, కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ఈ డీపీఆర్‌కి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్రవేసింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పలు సంస్థలు రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
అధికారులు రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారికి దాదాపు 173.73 కిలోమీటర్ల పొడవు ఉండనుంది.
ఈ రహదారిపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్‌, రీ అలైన్‌మెంట్ల నిర్మాణాలూ ఉంటాయి. కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారి నిర్మాణం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్‌ నుంచి ప్రారంభమవుతుంది.
కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణానదిపై రీ అలైన్‌మెంట్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. కర్నూల్‌ జిల్లాలోని ఎర్రమఠం, ముసిలిమాడ్‌, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్‌ రోడ్ల వరకు బైపా్‌సల రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నారు. నంద్యాల బైపాస్‌ చివరలోని జాతీయ రహదారి-40 జంక్షన్‌కు అనుసంధానం చేస్తారు.