త్వరలోనే జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు

త్వరలోనే జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అక్కడ పరిస్థితులు సాధారణ పరిస్థితులకు చేరుకోగానే  తాను లోక్‌సభలో హామీ ఇచ్చినట్లు రాష్ట్ర హోదా కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.  శనివారం వర్చువల్‌ విధానంలో జమ్మూ కశ్మీర్‌ డిస్ట్రిక్ట్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ను విడుదల చేశారు.  రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల ఖరారు కోసం డీలిమిటేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పిన అమిత్‌ షా.. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర హోదా ఇవ్వడానికి, ఎన్నికలకు లింక్ పెట్టడాన్ని ఆయన తోసిపుచ్చారు.  “ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించినంతవరకు, డీలిమిటేషన్ మొదలైంది. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. వారు (రాజకీయ పార్టీలు) ఏమి చెప్పినా, జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా వస్తుంది” అని భరోసా ఇచ్చారు.
 
ఈ ఏడాది రికార్డు స్థాయిలో జమ్మూ కశ్మీర్‌కు పర్యాటకులు వస్తున్నారని, ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు నేరుగా లబ్ధిపొందుతున్నారని  ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
కొందరు ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుపకుండా ఇక్కడ శాంతిభద్రతల పునరుద్ధరణ సాధ్యం కాదని చేస్తున్న వాదనలను అమిత్ షా ఎద్దేవా చేశారు. గత రెండేళ్లలో ఇక్కడ పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని స్పష్టం చేశారు. అంతకు ముందు రెండేళ్లతో పోల్చుకుంటే ఉగ్రవాద సంఘటనలు 40  శాతం, మరణాలు 57 శాతం తగ్గాయని వెల్లడించారు. 
కాగా, 2019లో జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన దగ్గర్నుంచీ అక్కడ ఎన్నికలు జరపాలని, అదే సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల కోసం, రాష్ట్ర హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి.