వెంకయ్యనాయుడుకు మళ్లీ కరోనా

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మళ్లీ కరోనా సోకింది. హైదరాబాద్‌లో నేడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకయ్యను ఇటీవల కలిసినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. 

కాగా, ఢిల్లీలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా బారిన పడి 24 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 54,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 13.32 శాతంగా ఉంది. అయితే ఢిల్లీలో కరోనా  పాజిటివిటీ రేటు నిన్న 16.3 శాతం ఉంటే.. ఇవాల 13.3 శాతానికి పడిపోయింది. కరోనా కేసులు కూడా 19% తగ్గాయి. 

ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి

మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తికి సంబంధించి ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్ కన్సార్టియం (ఇన్సాకాగ్) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఈ వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. ఆ కారణంగానే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది.

ఒమిక్రాన్ వ్యాప్తి విదేశీ ప్రయాణికుల నుంచి కన్నా దేశీయంగానే ఎక్కువగా జరుగుతోందని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికుల్లో  తొలుత ఈ వేరియెంట్ ను గుర్తించినట్లు చెప్పింది. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనపడటం లేదని ఇన్సాకాగ్ వెల్లడించింది. 

కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయని చెప్పింది. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం తక్కువగానే ఉంటోందని అయినా ఈ వేరియెంట్ ను నిర్లక్ష్యం చేయకుండా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.