ఐస్ కుట్ర దాడుల్లో ఇరాక్, సిరియా సైనికుల మృతి 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో జరిపిన సాయుధ దాడుల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తోంది. 

ఇరాక్‌లో శుక్రవారం తెల్లవారుజామున, సిరియాలో గురువారం సాయంత్రం ఈ సాయుధ ఘర్షణలు జరిగాయి. బాగ్దాద్‌కు ఉత్తర ప్రాంతంలోని అల్‌అజీమ్ జిల్లాలోని జైలుపై ఐఎస్ ఉగ్రవాదులు ఆధునిక ఆయుధాలతో దాడి జరిపినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రదాడి జరిగినపుడు సైనికులు గాఢనిద్రలో ఉన్నట్టు తెలిపారు. 

జైలులోని తమ సంస్థకు చెందిన ఖైదీలను విడిపించేందుకు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఐఎస్ దాడిలో లెఫ్టినెంట్‌స్థాయి అధికారిసహా 11మంది సైనికులు మృతి చెందారు.

సిరియాలోని హస్సాకే నగరంలోని జైలుపై 100మంది ఐఎస్ ఉగ్రవాదులు భారీ మెచిన్‌గన్లు, పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. జైలులోని తమ ఖైదీలను విడిపించే లక్షంతోనే ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. దాదాపు 3000మంది ఐఎస్ ఉగ్రవాదులు ఈ జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ దాడిలో అమెరికా మద్దతు ఉన్న ఏడుగురు కుర్దిష్ యోధులు, కనీసం 23మంది ఐఎస్ ఉగ్రవాదులు మరణించినట్టు అధికారులు తెలిపారు. అయితే, బ్రిటన్‌కు చెందిన సిరియా మానవ హక్కుల సంఘం ప్రకారం కనీసం 20మంది కుర్దిష్ యోధులు, జైలు సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు, ఐదుగురు పౌరులు మరణించారు. 

ఇరాక్, సిరియాల్లో చావుదెబ్బతిన్న ఐఎస్ ఇటీవల మరోసారి బలం పుంజుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. స్లీపర్‌సెల్స్‌గా భావించే మిలిటెంట్లను యాక్టివేట్ చేసినట్టు చెబుతున్నారు.