పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు

వేలాది గ్రూప్‌ సర్వీసెస్‌ పోస్టుల ఖాళీగా ఉండటంతో రాష్ట్రంలో పాలన నత్తనడకన సాగుతోందని పేర్కొంటూ తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,600 గ్రూప్‌-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు.  ఏడేళ్లుగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడం దారుణమని విమర్శించారు. గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్‌ ఆఫీసర్‌ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందని ఆయన  చెప్పారు. 

ఒక్కో ఐఏఎస్‌ అధికారి 3, 4 పోస్టులకు ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్‌-2 పోస్టులు, 2 వేల గ్రూప్‌-3 పోస్టులు, 40 వేల గ్రూప్‌-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంజయ్‌ పేర్కొన్నారు. 

కాగా, ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం రూ.578.85 కోట్లు మంజూరు చేసిందని బండి సంజయ్‌ తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు ఆయన, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలకు కృతజ్ఞతలు తెలిపారు

ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక అనుమతులకు ఆమోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. 

కాగా, కరోనా నియంత్రణ కోసమే విద్యా సంస్థలను మూసివేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. బార్లు, పబ్బుల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో చెప్పాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు,  మాజీ ఎంపీ విజయశాంతి డిమాండ్‌ చేశారు. 

పబ్బులు, బార్లల్లో కొవిడ్‌ వ్యాపిస్తున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికే రాజకీయ నాటకాలకు తెరతీస్తున్నారని ఆమె  విమర్శించారు.