కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
 
కాగా, గ్రేటర్‌లో హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్ దడ పుట్టిస్తున్నాయి. బోరబండ, అమీర్ పేట్, హఫీజ్ పేట్, బంజారా హిల్స్, గోల్కొండ, చింతల్ బస్తీ, ఎర్రగడ్డలో కేసులు పెరుగుతున్నాయి. అజంపుర, బొగ్గులకుంట, రామంతపూర్ ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా వెలుగు చూశాయి. నగరంలోని టెస్టింగ్ సెంటర్స్ వద్ద భారీగా క్యూ పెరుగుతోంది. 
 
జీహెచ్ఎంసీ పరిధిలోని 106 కొవిడ్ టెస్టింగ్ సెంటర్ల వద్ద గత రెండు రోజులుగా రద్దీ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌లో 10 వేల ర్యాపిడ్, 5 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరిధిలో పాజిటివ్ రేట్ పెరుగుతోంది.

రేపటి నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్ అందజేస్తామని పేర్కొన్నారు.
 
ప్రభుత్వాస్పత్రులకు పూర్తిస్థాయిలో హోం ఐసొలేషన్, టెస్టింగ్‌ కిట్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.