భారత బాలుడిని అపహరించిన చైనా సైన్యం!

అరుణాచల్ ప్రదేశ్-లోని సియాంగ్ జిల్లాకు చెందిన 17ఏళ్ల యువకుడిని చైనా సైన్యం అపహరించు కెళ్ళింది. అతడిని మీరామ్ టారోన్‌గా గుర్తించారు. అయితే అతడిని తమకు అప్పగించాలని భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ అనే బాలుడుని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపి తపిర్ గావో బుధవారం ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అతను అపహరణకు గురైనట్లు తెలిపారు. తరోణ్ స్నేహితుడు జానీ యైయింగ్ మాత్రం తప్పించుకుని అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 

దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పిఎల్‌ఎకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ, చైనా సైన్యాన్ని కోరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు.

అయితే, తరోణ్ ఆపహరణ వార్తలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ విషయం గురించి తమకు తెలియదనిపెక్రో న్నారు. సరిహద్దుల వద్ద చైనా ఆర్మీ చాలా అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అక్రమంగా దేశంలోకి రావడాన్ని, వెళ్లడాన్ని అణచివేస్తుందని చెప్పారు. 

దాదాపు 20 నెలలుగా, తూర్పు లడఖ్‌లో భారత్,  చైనా దళాలు ప్రతిష్టంభనలో ఉన్నాయి. అనేక రౌండ్ల సైనిక,  దౌత్య స్థాయి చర్చలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. జనవరి 12న జరిగిన కార్ప్స్ కమాండర్ల స్థాయి చర్చల చివరి రౌండ్‌లో, ఇది సిరీస్‌లో 14వది, చైనా ఘర్షణ పాయింట్‌ల నుండి వెనుకడుగు వేయడానికి  నిరాకరించింది. అయితే భారత సైన్యం హాట్ స్ప్రింగ్ (పెట్రోలింగ్ పాయింట్ 15) ప్రాంతంలో సానుకూల ఫలితాన్ని ఆశించింది. .

కానీ, ఖుర్నాక్‌లోని పాంగోంగ్ సరస్సు మీదుగా భారతదేశం క్లెయిమ్ చేస్తున్న ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్లు తాజా ఉపగ్రహ చిత్రాలతో తేలడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ వంతెన ఎనిమిది మీటర్ల వెడల్పు,  400 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంది.  ఇది రాబోయే కొద్ది నెలల్లో పూర్తవుతుందని,  చైనా సైన్యం వేంగంగా కదలడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. 

చైనా 1950ల చివరలో ఖుర్నాక్ కోట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.  1962 యుద్ధంలో పశ్చిమాన సిరిజాప్ ప్రాంతానికి తన నియంత్రణను విస్తరించింది. ఇది టిబెట్‌ను జిన్‌జియాంగ్‌తో కలిపే హైవేపై 180 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుందని సైనిక పరిశీలకులు భావిస్తున్నారు. 

పాంగోంగ్ త్సో పాక్షికంగా లడఖ్‌లో, పాక్షికంగా టిబెట్‌లో ఉండగా,  సరస్సులో మూడింట ఒక వంతు భారత్ ఆధీనంలో ఉంది.   సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ  దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో వంతెనను నిర్మిస్తున్నారు.
జనవరి 6న, 60 ఏళ్లుగా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలో చైనా వంతెనను నిర్మించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. 14వ రౌండ్ చర్చల సందర్భంగా వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం లేవనెత్తింది.

అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు అయిన జాంగ్నాన్‌లోని 15 ప్రదేశాల పేర్లను చైనీస్ అక్షరాలు, టిబెటన్,  రోమన్ వర్ణమాలలో ప్రామాణికం చేసినట్లు గత నెలలో చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తమ భూభాగమని చైనా క్లెయిమ్ చేసి దానిని జంగ్నాన్ అని పిలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటినుంచో ఉందని, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేస్తూ చైనా చర్యపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. “అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు పేర్లను కేటాయించడం ఈ వాస్తవాన్ని మార్చదు” అని భారత విదేశాంగ ప్రతినిధి తేల్చి చెప్పారు.

గత వారం, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణానే  లడఖ్‌లో పరిస్థితి “స్థిరంగా ఉంది”,   “నియంత్రణలో ఉంది” అని  పేర్కొంటూ, గత 18 నెలల్లో, చైనాతో ఉత్తర సరిహద్దులలో భారత సైన్యం తన సామర్థ్యాలను అనేక రెట్లు పెంచుకుందని చెప్పారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి గతంలోకన్నా మెరుగుగా తయారై ఉన్నామని ప్రకటించారు.

తూర్పు లడఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగింపు దశకు చేరుకోనందున, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులనైనా  ఎదుర్కొనేందుకు భారత సైన్య తన దళాలను వేగంగా తరలించడానికి గత రెండేళ్లలో సరిహద్దు ప్రాంతాలలో తన మౌలిక సదుపాయాలను పటిష్టం చేసింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల 27 కొత్త రోడ్లు,  వంతెనలను ప్రారంభించింది. వాటిలో చాలా చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి.