మణిపూర్ లో అధికారం నిలబెట్టుకోనున్న బిజెపి 

మణిపూర్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్‌క్యూ ప్రిపోల్‌ సర్వే అంచనా వేసింది. 60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో బీజేపీ  31-37 సీట్లు (39.2 శాతం ఓట్లు) గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 13-19 సీట్లు (28.7 శాతం ఓట్లు) దక్కుతాయని తెలిపింది. 
 
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 3 నుంచి 9, నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) ఒకటి నుంచి 5 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఎన్‌పీపీకి 14.2, ఎన్‌పీఎఫ్‌ 6.4, ఇతరులు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంటారని అంచనా కట్టింది.
 
2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ ఐదేళ్ల కాలంలో 29కి పెరిగింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి.
 
మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 59 శాతం మంది, ఫర్వాలేదని 29 శాతం, బాలేదని 12 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉపాధిలేమి అని ఎక్కుమంది (29 శాతం) తెలిపారు. తాగునీటి కొరత(24 శాతం), అస్తవ్యస్థ రహదారులు(17 శాతం), అవినీతి(5 శాతం) వంటి సమస్యలు కూడా ఉన్నాయని వాపోయారు. 
 
తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ బైరాన్‌ సింగ్‌ పేరును ఎ‍క్కువ మంది  (36 శాతం) చెప్పారు. ఇబోబి సింగ్‌(17 శాతం), యుమ్నం జోయ్‌కుమార్ సింగ్ (11 శాతం), గైఖేంగమ్ (10 శాతం), బిశ్వజిత్‌ (5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, తొలి విడత పోలింగ్‌ తేదీని మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరుతోంది.