ఆరిపోనున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల నేటి నుంచి శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియాగేట్, వార్ మెమోరియల్ ల వద్ద రెండు జ్వాలల నిర్వహణ కష్టతరమవుతోందని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల స్మరణార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జ్యోతిని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిరంతరం మండుతున్న అమర్ జవాన్ జ్యోతి… 50 ఏళ్ల  తర్వాత శాశ్వతంగా ఆరిపోతుంది. గణతంత్ర దినోత్సవానికి 5 రోజుల ముందు శుక్రవారం జరిగే కార్యక్రమంలో నేషనల్ వార్ మెమోరియల్ టార్చ్‌తో విలీనం చేయనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ మార్షల్ బలబద్ర రాధా కృష్ణ లు పాల్గొంటారని ఆర్మీ అధికారులు తెలిపారు.ఇప్పటికే దేశంలోని అమరవీరుల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున, ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకు వెలిగించాలనే వాదన కూడా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఇండియా గేట్‌పై చెక్కిన అమరవీరుల పేర్లు కూడా ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నేషనల్ వార్ మెమోరియల్‌లో 1947-48 పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం నాటి నుంచి గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ వరకు వివిధ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ రక్షణ సిబ్బంది అందరి పేర్లు కూడా ఉన్నాయి.

స్మారకం గోడలపై ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లు కూడా ఉన్నాయి. నేషనల్ వార్ మెమోరియల్‌లోని అమర జవాన్ జ్యోతిలో దీన్ని కలపనున్నారు.ఈ స్మారక చిహ్నంలో భారత సైన్యం, వైమానిక దళం , నావికాదళం చేసిన ప్రసిద్ధ యుద్ధాలను వర్ణించే ఆరు కాంస్య కుడ్యచిత్రాలు, వీర్త చక్రం గ్యాలరీలో ఉన్నాయి. పాకిస్థాన్‌తో 1971 యుద్ధం అనంతరం నాటి అమరుల స్మరణార్థం 1972లో అమర్ జవాన్ జ్యోతి వెలిగించారు.