లండన్ ఇంటిని విజయ్ మాల్యా ఖాళీ చేయాలని కోర్ట్ ఆదేశం

బ్యాంకులను మోసం చేసిన కేసుల నుండి తప్పించుకోవడానికి భారత్ నుండి పారిపోయి లండన్ లో నివాసముంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యకు అక్కడ కోర్టుల నుండి వరుసగా చుక్కెదురవుతున్నది. తాజాగా ఆయన ఉంటున్న విలాసవంతమైన ఇంటిని ఖాళీ చేయమని కోర్ట్ ఆదేశం ఇచ్చింది. 

లండన్‌లోని రిజెంట్‌ పార్క్‌లో ఉన్న కార్న్‌వాల్‌ టెర్రస్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్‌ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్‌ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్‌ హై కోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్‌మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది.

లండన్‌ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్‌ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు.  వేరే బెంచ్‌కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు.

‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్‌ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్‌ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు.

లండన్‌లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో అతని కొడుకు సిద్ధార్థ్‌మాల్యా (34)తో పాటు విజయ్‌ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. 

ఈ వయస్సులో ఇప్పటికిప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని… కనీసం మానవతా దృక్పథంతో విజయ్‌మాల్యా తల్లి వయస్సుని పరిగణలోకి తీసుకునైనా తీర్పు ఇవ్వాలంటూ మాల్యా తరఫున న్యాయవాదులు కోరారు. కానీ విజయ్‌ మాల్యాకి ఊరట లభించలేదు.

భారత్‌ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి, బ్రిటన్‌కు విజయ్‌మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్‌బీఐ నేతృత్వంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. 

ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ యాచ్‌లే ఉన్నాయి.  కానీ స్విట్జర్లాండ్‌ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్‌మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది.