ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉన్న ఒమిక్రాన్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రాయెసస్‌ హెచ్చరించారు. గత వారంలో సుమారు ప్రపంచ వ్యాప్తంగా 18 మిలియన్ల మంది (కోటి 80 లక్షల మంది) దీని బారిన పడ్డారని తెలిపారు. 
 
మరణాల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలుపై తీవ్ర ప్రభావాన్ని చూపి.. ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుండటంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాల్లో, కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయని, ఈ వేవ్‌ అత్యంత చెత్త దశగా ఉందని పేర్కొన్నారు. 
 
ఏ దేశం కూడా దీని బారిన పడకుండా.. బయటకు రాలేదని తెలిపారు. తాను వ్యాక్సినేషన్‌ తక్కువ ఉన్న దేశాల పట్ల ఆందోళన చెందుతున్నానని, టీకాలు తీసుకోకపోవడం వల్ల మహమ్మారి బారిన పడతారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశాలుంటాయని టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. 
 
ఒమిక్రాన్‌ తక్కువ తీవ్రత కావచ్చునేమో కానీ, తేలిక పాటి వ్యాధి అనే కథనం తప్పు దారి పట్టించేదని, దీని వల్ల తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొవలసి ఉండేదని, మరిన్ని ప్రాణాలు బలయ్యేవని అన్నారు.
ఇలా ఉండగా, కరోనా  రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. ఈమేరకు ఎయిమ్స్, ఐసిఎంఆర్‌కొవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ జాయింట్ మోనిటరింగ్ గ్రూపు (డిజిహెచ్‌ఎస్) సవరించిన వైద్య మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జారీ చేసింది. 
ఆక్సిజన్ సరఫరా అవసరం లేకుండా, ఎక్కువ డోసుల స్టెరాయిడ్ల ఇంజక్షన్లను కరోనా రోగులు చికిత్సలో కానీ, తరువాత కానీ వినియోగించడం వల్ల ప్రయోజనం కలుగుతుందనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని స్పష్టం చేసింది. ఇటువంటి స్టెరాయిడ్లను ప్రారంభ దశలో లేదా అవసరానికి మించి సుదీర్ఘకాలం వినియోగిస్తే బ్లాక్ ఫంగస్ (మ్యూకోమైకోసిస్) రెండో ఇన్‌ఫెక్షన్‌గా సంక్రమిస్తుందని హెచ్చరించింది. 
ఇదే సమయంలో రెండు మూడు వారాల పాటు దగ్గు కొనసాగుతుంటే క్షయవ్యాధి పరీక్షలు కానీ లేదా ఇతర పరీక్షలు కానీ కొవిడ్ రోగులు చేయించుకోవాలని సూచించింది.
తాజాగా శ్రీనగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలోని 80 మంది వైద్యులు, పారామెడికల్‌ ఉద్యోగులు, ఎంబిబిఎస్‌ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే వైద్యకళాశాలలో ఇన్ని కేసులు వెలుగు చూడటం కలవరాన్ని సృష్టిస్తోంది. 46 మంది డాక్టర్లు, 22 మంది ఎంబిబిఎస్‌ విద్యార్థులు, 15 మంది పారామెడికల్‌ ఉద్యోగులకు కరోనా సోకిందని కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ సలీంఖాన్‌ చెప్పారు. ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 546కు పెరిగాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.