సగం మంది టీనేజ్ యువతకు టీకాలు

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సోమవారం నాటికే మూడున్నర కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. 
 
పక్షం రోజులలోనే ఈ లక్ష్యం చేరుకోవడం విశేషం. అంతేకాదు ఆరోగ్య రంగ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 సంవత్సరాలు పై బడిన వారికి 50 లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది.  అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 158 కోట్ల 4 లక్షలకు పైగా టీకాలు వేశారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా ఉపయోగించని 13 కోట్ల 25 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.  మరోవంక, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షల నిర్వహణ తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్దిష్ట ప్రాంతాల్లో పాజిటివిటీ కేసుల ట్రెండ్ కొనసాగుతున్న దృష్ట్యా వ్యూహాత్మక విధానాలను అనుసరించాలని, తక్షణం కోవిడ్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారంనాడు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది.
వైరస్ వ్యాప్తి జాడను సమర్ధవంతంగా తెలుసుకుని, వ్యాధి విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ పరీక్షలను పెంచాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యల్లో భాగంగా కొత్త క్లస్టర్లు, హాట్‌స్పాట్‌లు గుర్తించాలని, కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.
జనవరి 10న ఐసీఎంఆర్ జారీ చేసిన టెస్టింగ్ స్ట్రాటజీని అనుసరించాలని పేర్కొంది. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతుండగా, కోవిడ్ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల నమోదు తగ్గుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.