దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో మూడు లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3,17,532 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా… 491 మంది మృతి చెందారు. 
 
అలాగే కొవిడ్ నుంచి కోలుకుని 2,23,990 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా ఉంది. రోజువారి కోవిడ్ పాజిటివ్ రేటు 16.41 శాతంగా నమోదు అయ్యింది. నిన్నటి కంటే నేడు దేశంలో అదనంగా 3.63 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. మరోవైపు భారత్‌లో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
 
ఇప్పటి వరకు 159.67 కోట్ల మంది టీకా తీసుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697 కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 40,499 కేసులు నమోదవగా… కేరళ రాష్ట్రంలో 34,199 కేసులు, గుజరాత్‌లో 20,966 కేసులు నమోదయ్యాయి. 
 
తమిళనాడులో 26,981 కేసులు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 11,447 కేసులు, దేశ రాజధాని ఢిల్లీలో 13,785 కేసులు, హర్యానాలో 8847 కేసులు, జమ్ము కశ్మీర్‌లో 5818, గోవాలో 3936 కొవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
 
టీకా ప్రభావం ఆరు నెలలకే 
 
ఇలా ఉండగా,  కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని..30శాతం మందిలో యాంటీ బాడీల సంఖ్య పడిపోతోందని ఏఐజీ అధ్యయనంలో తేలింది. 40ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ మార్పు అధికంగా ఉందని తెలిపింది. 
 
ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ మొత్తం 1636 మంది ఆరోగ్య కార్యకర్తల పై అధ్యయనం చేసింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత యాంటీ బాడీల స్థాయిలను అంచనా వేశారు. 
 
వీరిలో యాంటిబాడీల తగ్గుదల కనింపించిందని అధికారులు అంటున్నారు. వీరంతా కూడా మధుమేహం, అధిక రక్త పోటుతో బాధపడుతున్న వారేనని తెలిపారు. దీంతో ఆరు నెలల తర్వా వీరంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. 

బాదల్ కు కరోనా 

పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ ప్యాట్రన్ ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 94 ఏళ్ల వయసుగల వెటరన్ రాజకీయ నాయకుడైన బాదల్ కు కొవిడ్ లక్షణాలుండటంతో అతన్ని లూథియానాలోని దయానంద్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.

బాదల్ కు స్వల్ప జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు ఉన్నాయని డాక్టర్ బిషవ్ మోహన్ చెప్పారు. బాదల్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందని శిరోమణి అకాలీదళ్ పార్టీ లూథియానా అభ్యర్థి మహీ షిందర్ సింగ్ చెప్పారు. ప్రకాష్ సింగ్ బాదల్ కరోనా నుంచి కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.