ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక చీకటి రోజు

ఏపీ ఉద్యోగుల భయాందోళనలే నిజమయ్యాయి. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి   ప్రభుత్వ ‘రివర్స్‌ పీఆర్సీ’ ఖరారు చేయడంతో ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ సిబ్బంది పెన్షన్లు భారీగా తగ్గనున్నాయి. వేతన సవరణకు సంబంధించిన జీవోలు సోమవారం రాత్రి పొద్దుపోయాక విడుదలయ్యాయి.
 ఇప్పటికే  ఐఆర్‌  27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ (23.29 శాతం) ప్రకటించిన సర్కారు… ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. క్వాంటమ్‌ పెన్షన్లలోనూ ఒక శ్లాబు ఎత్తేసింది.  దీంతో పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు ‘రివర్స్‌’ గేరు వేశాయి.
 
ఈ  మూడు జీవో లు ఉద్యోగులకు, పెన్షనర్లకు  ఒక చీకటి రోజు అని ఎపి జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఈ విధంగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వానికి ఉద్యోగుల మీద ప్రేమ లేదని కనిపిస్తుందని, ప్రభుత్వం తమకు కోత పెట్టి డబ్బులు మిగుల్చుకుంటుందని ఎద్దేవా చేశారు.
జిఒ లు రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎల్లుండి రెండు జెఎసి ల తరపున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. పీఆర్సీ వల్ల తమకు లాభం కాకుండా నష్టం జరుగుతుందని ఆవేదన చెందారు.
 
ఈ సందర్భంగా ఎపి జెఎసి అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిఎం ప్రకటించిన సమయంలోనే చాలా సమస్యలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఇంటి అద్దె భత్యంను 16 శాతానికి తగ్గించడం దారుణమని ధ్వజమెత్తారు. మూడు జీవోలను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వాలని కోరారు. 
 
ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో ఇంతవరకు చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు రూ. 40 వేలు హెచ్‌ఆర్‌ఏ తీసుకొని.. తమకు తగ్గించాలని రిపోర్ట్ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. తమకు ఈ పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీ, డిఏలను  కొనసాగించాలని కోరారు. 
 
గత ప్రభుత్వాల్లో సాధించుకున్న హక్కును ఈ ప్రభుత్వం తొలగిస్తుందని ఆవేదన చెందారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్డ్‌ స్కీం లో కూడా ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. గ్రాట్యుటీ సీలింగ్‌ ఎత్తివేయడం చాలా దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మాస్టర్‌ స్కేల్స్‌ను పక్కనపెట్టి ఇవ్వడం అభ్యంతరంగా ఉందని పేర్కొన్నారు. 
 
10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ని తాము అంగీకరించడం లేదు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అశుతోష్‌ మిశ్రా రిపోర్ట్‌ ఇచ్చేవరకూ తమ పోరాటం ఆగదు అని, అవసరమైతే సమ్మెకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.