దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర

దేశానికి స్టార్టప్ లు వెన్నముకగా మారనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో దేశాభివృద్ధిలో స్టార్టప్ లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత్ స్టార్టప్ లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రపంచ అతి పెద్ద మిల్లీనియల్ మార్కెట్‌గా భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు బలపడటం కొనసాగుతోందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.   గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇండస్ట్రీ 4.0 వరకు మన అవసరాలు, సామర్థ్యం అపరిమితమని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన స్టార్టప్ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. 
భారత దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ నిరంతరం తనను తాను తెలుసుకుంటూ, అభివృద్ధి చెందుతోందని చెప్పారు. నేర్చుకుంటూ, పరివర్తన చెందే నిలకడైన స్థితిలో ఇది ఉందని చెబుతూ  మన దేశంలోని స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు 55 వేర్వేరు పరిశ్రమల్లో ఉన్నట్లు చెప్పారు.
ఐదేళ్ళ క్రితం మన దేశంలో కనీసం 500 స్టార్టప్‌లు అయినా ఉండేవి కాదని గుర్తు చేశారు. ఇప్పుడు వీటి సంఖ్య 60,000 దాటినట్లు తెలిపారు. స్టార్టప్‌లు నవ భారతానికి వెన్నెముక కాబోతున్నాయని తెలిపారు.
‘‘మనం భారత దేశం కోసం కొత్తవాటిని కనుగొందాం, భారత దేశం నుంచే కనుగొందాం’’ అనే మంత్రాన్ని పాటించాలని యువతను కోరారు. ‘‘మీ కలలను స్థానిక స్థాయికే పరిమితం చేయవద్దని, ప్రపంచ స్థాయిలో కలలుగనాలని చెప్పారు. జనవరి 16న జాతీయ స్టార్టప్‌ల దినోత్సవం మన దేశంలో జరుగుతుందని తెలిపారు.