వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

భారత మార్కెట్లో విక్రయించే వాహనాల్లో ప్రయాణీకుల భద్రత గురించిన ఆందోళనల పరిష్కారానికి ఎనిమిది మంది ప్రయాణించే వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండేలా జిఎస్‌ఆర్ ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్‌లో తెలిపారు. 

‘ఈ చర్య కచ్చితంగా వాహనం ధర/వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాలలో ప్రయాణీకుల భద్రతకు నిర్ధారిస్తుంద’ని గడ్కరీ పేర్కొన్నారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను 1 జులై 2019 నుండి అలాగే ఫ్రంట్ కోప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను ఈ సంవత్సరం జనవరి 1 నుండి అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తప్పనిసరి చేసింది.

ఎం1 వెహికల్ క్యాటగిరీలో అంటే గూడ్స్ క్యారియర్ లేదా ప్యాసెంజర్ క్యారియర్ ముందు అలాగే వెనుక రెండు కంపార్టుమెంట్‌లకు వెనక ఢీకొనే ప్రమాదం ప్రభావాన్ని తగ్గించడానికి నాలుగు అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని నిర్ణయించబడింది. ఇందులో రెండు సైడ్/సైడ్ టోర్సో ఎయిర్ బ్యాగులు, రెండు వైపులా కర్టెన్/ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

ఇవి కారులోని ప్రయాణీకులందరినీ కవర్ చేస్తాయి. భారతదేశంలో మోటార్ వాహనాలను మునుపెన్నడూ లేనంత సురక్షితమైనదిగా మార్చడంలో ఒక ముఖ్యమైన దశ అని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న అగ్రదేశాల్లో భారతదేశం ఒకటి. 

ఈ రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు, తీవ్ర గాయాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రమాదాలకు ట్రాఫిక్ ఉల్లంఘనలే ప్రధాన కారణమని చెబుతున్నారు. కానీ తగిన భద్రతా చర్యలు లేనందున ముఖ్యంగా చిన్న ఎంట్రీ లెవల్ వాహనాలలో కూడా పెద్ద సంఖ్యలో మరణాలకు కారణం అవుతున్నాయి.