తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని భోగి శుభాకాంక్షలు

భోగి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్ర ప్రజలకు తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా ఇంగ్లిష్ లో శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని.. అనంతరం తెలుగు ప్రజలందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు.. అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. 
 
ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. హిందువులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను తమతమ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. 
 
వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మూడురోజుల పాటు.. తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భోగి మంటలతో బీజేపీ నిరసన 
 
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు భోగి మంటల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పిడకలను భోగి మంటల్లో వేసి జగన్ సర్కార్ తీరుపై నిరసన తెలిపారు. బీజేపీ నేత షేక్ బాజీ మాట్లాడుతూ ఎపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. పంటలు ఇళ్లకు రాక.. రైతుల ఇళ్లల్లో నిస్తేజం ఏర్పడిందని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర  ప్రభుత్వం మద్యం, ఇసుక అమ్ముకుంటూ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని,  విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. సినిమా టిక్కెట్ల అమ్మకంపై ఉన్న దృష్టి.. పేదల కష్టాలు తీర్చడంలో లేదని పేర్కొన్నారు. 
 
సంక్రాంతి పండుగ సందడి లేక.. ఎంతోమంది పస్తులు ఉంటున్నారని, జగన్ పాలనలో అన్ని వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ వైఫల్యాలకు నిరసనగానే పిడకలను భోగి మంటల్లో వేశామని, ఇప్పటికైనా జగన్‌లో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నామని షేక్ బాజీ అన్నారు.